Jagtial: జగిత్యాల విద్యా రంగంలో మైలురాయి!

Jagtial: చల్‌గల్‌లో కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవన నిర్మాణానికి భూమిపూజ. ఎంపీ అరవింద్, మంత్రి లక్ష్మణ్ కుమార్, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఘనంగా శంకుస్థాపన.

ANAND, JAGITYAL
Published on: 12 July 2026 4:11 PM IST
Jagtial
X

Jagtial: జగిత్యాల విద్యా రంగంలో మైలురాయి!

Jagtial: జగిత్యాల జిల్లాకు మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ రానుంది. చల్‌గల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో విద్యార్థుల భవిష్యత్తుకు మరింత బలమైన పునాది పడిందని నాయకులు పేర్కొన్నారు.

జగిత్యాల జిల్లాలో నూతనంగా ఏర్పాటు కానున్న కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవన నిర్మాణానికి చల్‌గల్ గ్రామంలో భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలోనే కేంద్రీయ విద్యాలయం తరగతులు ప్రారంభించే అవకాశం ఉన్నందున తాత్కాలికంగా భవనం కేటాయించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. శాశ్వత భవనం పూర్తయ్యే వరకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, త్రివిధ దళాలు, రైల్వే, నేవీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలతో పాటు స్థానిక విద్యార్థులకు కూడా ఈ కేంద్రీయ విద్యాలయంలో చదివే అవకాశం కల్పించనున్నట్లు వివరించారు.

అనంతరం మాట్లాడిన ప్రజాప్రతినిధులు జగిత్యాల జిల్లా చల్‌గల్ గ్రామంలోని జాతీయ రహదారి పక్కన ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించి కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకురావడం జిల్లాకు గర్వకారణమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో నవోదయ వంటి మరిన్ని జాతీయ స్థాయి విద్యాసంస్థలను జిల్లాకు తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతాయని తెలిపారు.

పార్టీలకు అతీతంగా జిల్లాభివృద్ధే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేస్తున్నామని నాయకులు స్పష్టం చేశారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు వల్ల జగిత్యాల జిల్లా విద్యార్థులకు జాతీయ స్థాయి విద్య అందుబాటులోకి రావడంతో పాటు వారి భవిష్యత్తుకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని అభిప్రాయపడ్డారు.

చల్‌గల్‌లో కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపనతో జగిత్యాల జిల్లా విద్యారంగంలో మరో కీలక అడుగు పడింది. త్వరలోనే తరగతులు ప్రారంభం కానుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL

Next Story