Metpally: మెట్టుపల్లి సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ప్రభుత్వ PCల్లో గేమ్స్

Metpally: మెట్టుపల్లి సబ్-రిజిస్ట్రార్ ప్రశాంత్ ప్రభుత్వ కంప్యూటర్లలో పిల్లలతో గేమ్స్ ఆడించడం వివాదాస్పదమైంది. ఈ బాధ్యతారాహిత్యంపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 July 2026 10:19 AM IST
Metpally
X

Metpally: మెట్టుపల్లి సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ప్రభుత్వ PCల్లో గేమ్స్

మెట్టుపల్లి: జగిత్యాల జిల్లా మెట్టుపల్లి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో చోద్యం.. ప్రభుత్వ కంప్యూటర్లలో పిల్లల గేమింగ్.

ప్రభుత్వ కార్యాలయాలు అంటే ప్రజల సమస్యలు తీర్చే వేదికలా? లేక ఉద్యోగుల పిల్లలు ఆటలాడుకునే గేమింగ్ జోన్లా? జగిత్యాల జిల్లా మెట్టుపల్లి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన ఈ ఘటనే అందుకు నిదర్శనం. నిత్యం డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు, ఆస్తి లావాదేవీలతో బిజీగా ఉండాల్సిన సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలోని ప్రభుత్వ కంప్యూటర్లలో చిన్న పిల్లలు గేమ్స్ ఆడుతుండటం స్థానికంగా కలకలం రేపింది.

​శనివారం రోజున మెట్టుపల్లి సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులో సిబ్బంది కొరత స్పష్టంగా కనిపించింది. ఆఫీసులోని మెజారిటీ సిబ్బంది సెలవులో ఉండటంతో, కేవలం ఒక అటెండర్‌తో పాటు జూనియర్ అసిస్టెంట్, ఇంచార్జ్ సబ్-రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రశాంత్ మాత్రమే ఆఫీసులో ఉన్నారు.

​అయితే, సెలవు రోజునో లేక పని ఒత్తిడి లేకపోవడం వలనో కానీ.. ఇంచార్జ్ సబ్-రిజిస్ట్రార్ ప్రశాంత్ తనతో పాటు పిల్లలను కూడా కార్యాలయానికి తీసుకువచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా, ఏకంగా అత్యంత కీలకమైన, ప్రజల డేటాతో కూడిన ప్రభుత్వ కంప్యూటర్‌ను పిల్లల చేతికి ఇచ్చేశారు. దాంతో ఆ పిల్లలు హాయిగా ఆ కంప్యూటర్‌లో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేశారు.

​లక్షలాది రూపాయల విలువైన ఆస్తుల వివరాలు, ప్రజల వ్యక్తిగత సమాచారం భద్రపరిచే సబ్‌-రిజిస్ట్రార్ కార్యాలయ కంప్యూటర్లను ఇలా బాధ్యతారాహిత్యంగా పిల్లల చేతికి ఇవ్వడంపై ప్రజలు, హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను, అధికారిక సిస్టమ్స్‌ను వ్యక్తిగత ప్రయోజనాల కోసం, పిల్లల ఆటల కోసం ఉపయోగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

​ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఇంచార్జ్ సబ్-రిజిస్ట్రార్ ప్రశాంత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

​ప్రభుత్వ కార్యాలయాల భద్రత, సిస్టమ్స్ వినియోగంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించిందనడానికి మెట్టుపల్లి సబ్‌-రిజిస్ట్రార్ ఆఫీస్ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. మరి ఈ వ్యవహారంపై శాఖాపరమైన చర్యలు ఉంటాయో లేదో వేచి చూడాలి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story