Metpally: మెట్టుపల్లిలో వరి కొనుగోలు కేంద్రాల కోసం ప్రజావాణిలో రైతుల ఫిర్యాదు!

Metpally: జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్టుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని రైతులు ఫిర్యాదు చేశారు.

GUJJETI SRINIVAS, KORUTLA
Updated on: 23 Nov 2026 12:12 PM IST
Metpally
X

Metpally: మెట్టుపల్లిలో వరి కొనుగోలు కేంద్రాల కోసం ప్రజావాణిలో రైతుల ఫిర్యాదు!

మెట్టుపల్లి: జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం రైతులు ప్రజావాణిలో పిర్యాదు చేశారు. ప్రభుత్వ సూచనల మేరకు సన్నరకం వరి సాగు చేస్తే.. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు లేక దళారుల చేతిలో నిలువునా మోసపోతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెట్టుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో రైతులు అధికారులకు తమ గోడును వెళ్లబోసుకున్నారు.

జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం రైతుల సమస్యలతో వేడెక్కింది. మండలంలో తక్షణమే వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

​ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకే తాము ఈ సీజన్‌లో సన్నరకం వరిని సాగు చేశామని రైతులు గుర్తు చేశారు. అయితే, పంట చేతికొచ్చినా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మొన్నటి వరకు క్వింటాల్‌కు 4,500 రూపాయల చొప్పున కొనుగోలు చేసిన వ్యాపారులు, ఇప్పుడు కేవలం 2,500 రూపాయలకే అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

​ప్రభుత్వం చెప్పిందనే మేము సన్నరకాలు పండించాము. మొన్నటి దాకా 4500 రూపాయలు పలికిన ధరను దళారులు ఇప్పుడు 2500 రూపాయలకు తగ్గించేశారు. ఇది మాకు తీవ్ర నష్టం. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. క్వింటాల్‌కు 3,500 రూపాయల ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేసి మమ్మల్ని ఆదుకోవాలి.

రైతుల ఆవేదనను విన్న ప్రజావాణి అధికారులు సానుకూలంగా స్పందించారు. మరో రెండు, మూడు రోజుల్లోనే మండలంలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA