Jagtial: రైతుల కోసం యూనిట్ రూ.14 పెట్టి కొనుగోలు చేస్తున్నాం: ఎమ్మెల్యే!
Jagtial: రాయికల్‌లో రూ.30 లక్షలతో 4 కొత్త డీటీఆర్‌లను ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్. లో-వోల్టేజీ సమస్యకు చెక్, సంక్షేమ పథకాల అమలుపై వివరణ.
Jagtial: రైతుల కోసం యూనిట్ రూ.14 పెట్టి కొనుగోలు చేస్తున్నాం: ఎమ్మెల్యే!
జగిత్యాల: రాయికల్ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు. ₹30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నాలుగు కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను (డీటీఆర్‌లను) ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు.
ఉచిత విద్యుత్: గృహజ్యోతి పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ఒక్క రాయికల్ మండలంలోనే ఈ పథకం అమలుకు ₹11.70 కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు డీడీ చెల్లించిన వారికి వెంటనే విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు.
రైతు సంక్షేమం: వర్షాకాలంలో విద్యుత్ డిమాండ్ పీక్ స్థాయికి చేరినా, రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం బయట మార్కెట్‌లో యూనిట్ ₹14 చొప్పున కొనుగోలు చేసి మరి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తోందన్నారు. ఉచిత విద్యుత్‌తో పాటు రుణమాఫీ, రైతుభరోసా వంటి పథకాలు రైతులకు అండగా నిలుస్తున్నాయని చెప్పారు.
మహాలక్ష్మి పథకం: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ₹12,385 కోట్ల మేర ప్రయాణ ఖర్చులు ఆదా అయ్యాయని వివరించారు.
అభివృద్ధి పనుల వేగవంతం:
రాయికల్ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, మైతాపూర్–రామాజీపేట బ్రిడ్జి పనులు పూర్తి చేశామని, మిగిలిన అప్రోచ్ రోడ్డు పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గతంలో మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకులు పూర్తి చేయలేని పనులను తాము పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. బోర్నపల్లి బ్రిడ్జికి నిధులు తెచ్చామని చెప్పుకునే నాయకులు, దానికి సంబంధించిన ఫారెస్ట్ క్లియరెన్స్ ఎందుకు ఇప్పించలేకపోయారని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు విడుదల చేసి, కొత్త అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
"రాజకీయాలు ఎన్నికల వరకే.. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా రాయికల్ పట్టణ, మండల అభివృద్ధి ఆగదు" అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, సర్పంచులు, విద్యుత్ శాఖ అధికారులు, రాయికల్ పట్టణ మరియు మండల నాయకులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




