Jammikunta: సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై మున్సిపల్ శాఖ ఉక్కుపాదం

Jammikunta: మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వాడితే రూ.2వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

GANESH, JAMMIKUNTA
Published on: 22 July 2026 9:54 PM IST
Jammikunta
X

Jammikunta: సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై మున్సిపల్ శాఖ ఉక్కుపాదం

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట, పట్టణంలో జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు, బజ్జీ బండ్లు, తోపుడు బండ్ల నిర్వాహకులతో పాత మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జి. మల్లికార్జున స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు. ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కవర్లలో టిఫిన్లు ఇవ్వకూడదని, ఆకులు లేదా పర్యావరణహిత పాత్రల్లో మాత్రమే ఆహారాన్ని అందించాలని సూచించారు. టీ స్టాళ్లలో టీని గాజు లేదా స్టీల్ గ్లాసుల్లో మాత్రమే అందించాలని తెలిపారు.ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు లేదా ఇతర నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే రూ.1,000 నుంచి రూ.2,000 వరకు జరిమానా విధించడంతో పాటు నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అదేవిధంగా బజ్జీ బండ్ల నిర్వాహకులు మెయిన్ రోడ్డుపై ఉన్న వైట్ లైన్ దాటకుండా, తమకు కేటాయించిన ప్రదేశాల్లోనే వ్యాపారం నిర్వహించాలని సూచించారు. దుకాణాల ఎదురుగా బండ్లు నిర్వహించుకున్నప్పుడు సంబంధిత యజమానులకు ఎలాంటి కిరాయి చెల్లించవద్దని తెలిపారు.

హోటల్ యజమానులు, బజ్జీ బండ్లు మరియు తోపుడు బండ్ల నిర్వాహకులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, వినియోగదారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని కమిషనర్ సూచించారు.ఈ సమావేశంలో మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఐ. రమేష్, జవాన్లు, హోటల్ యజమానులు, బజ్జీ బండ్ల నిర్వాహకులు, తోపుడు బండ్ల వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story