Manthani: ప్రాణాపాయంలో ఉన్న చిన్నారికి కమాన్‌పూర్ యువత చేయూత!
Manthani: మంథని పరిధిలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నాలుగు నెలల చిన్నారికి కమాన్‌పూర్ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ రూ.1,16,000 ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకుంది.
Manthani: ప్రాణాపాయంలో ఉన్న చిన్నారికి కమాన్‌పూర్ యువత చేయూత!
మంథాని: ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న కమాన్‌పూర్ హెల్పింగ్ హ్యాండ్స్ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలోని జూలపల్లి గ్రామానికి చెందిన బర్ల రమేష్ కుమార్తె మచ్చ సుమాంజలి–స్వామి దంపతుల నాలుగు నెలల కుమారుడు తీవ్రమైన మూర్ఛలతో బాధపడుతూ హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిన్నారి చికిత్సకు సుమారు రూ.14 లక్షలు అవసరమవుతాయని వైద్యులు సూచించడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది.
విషయం తెలుసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు నారగోని సతీష్ ఆధ్వర్యంలోని సభ్యులు స్పందించి రూ.1,16,000 ఆర్థిక సాయం అందించారు. ఆదివారం కమాన్‌పూర్ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్, జూలపల్లి బీఆర్‌ఎస్ నాయకుడు పోలుదాసరి సాయి, లైన్స్ క్లబ్ అధ్యక్షుడు సానా రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా ఈ మొత్తాన్ని చిన్నారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆపదలో ఉన్న కుటుంబానికి అవసరమైన సమయంలో ఆర్థిక చేయూత అందించడం అభినందనీయమన్నారు. దాతలను, సేవాభావం ఉన్నవారిని ఒక వేదికపైకి తీసుకొచ్చి నిరుపేదలకు హెల్పింగ్ హ్యాండ్స్ అండగా నిలుస్తోందని కొనియాడారు. చిన్నారి చికిత్సకు మరింత మంది దాతలు ముందుకొచ్చి కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీక్, హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.




