Karimnagar: ప్రభుత్వాలు విఫలం.. నల్గొండ సభకు 600 మంది రైతులు తరలింపు
Karimnagar: రైతుల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శిస్తూ.. నల్గొండలో జరిగే ఏఐకేఎస్ జాతీయ మహాసభలకు కరీంనగర్ నుంచి 600 మంది తరలివెళ్లారు.
Karimnagar: ప్రభుత్వాలు విఫలం.. నల్గొండ సభకు 600 మంది రైతులు తరలింపు
కరీంనగర్: ఆల్ ఇండియా కిసాన్ సభ (AIKS) జాతీయ మహాసభల సందర్భంగా నల్గొండలో నిర్వహించే భారీ బహిరంగ సభకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 600 మంది రైతులు, కార్మికులు, యువత పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా రైతు సంఘం కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. రైతాంగం ఎదుర్కొంటున్న వ్యవసాయ సంక్షోభం, పెట్టుబడి భారాలు, పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, రుణభారం వంటి సమస్యలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, రైతుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, పంటల కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, సాగునీరు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరారు.
రైతాంగ సమస్యలతో పాటు కార్మికుల హక్కులు, యువతకు ఉపాధి కల్పన వంటి కీలక అంశాలపై కూడా ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. రైతులు, కార్మికులు, యువత ఐక్యంగా ఉద్యమించినప్పుడే పాలక ప్రభుత్వాల విధానాల్లో మార్పు వస్తుందని పేర్కొన్నారు.
AIKS జాతీయ మహాసభలు దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమానికి నూతన దిశానిర్దేశం చేస్తాయని, రైతుల హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని మిల్కూరి వాసుదేవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఉప్పునూటి శ్రీనివాస్.వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి సుంకరి సంపత్.DYFI కార్యదర్శి నరేష్ పటేల్ నాయకులు పిల్లి రవి .దుర్గా ప్రసాద్. శివ కుమార్.అరవింద్.రత్నాకర్ మహేందర్.నితిన్ నరేందర్ .సురేష్.శ్రీకాంత్.శ్రీహరి. తదితరులు పాల్గొన్నారు.




