Karimnagar: మహిళా ఐక్యతకు, ఆడపిల్లల హక్కులకు ప్రతీక బతుకమ్మ
Karimnagar: కరీంనగర్ కోతిరాంపూర్లో ఐద్వా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. మహిళా హక్కులు, ఆడపిల్లల రక్షణ కోసం ఐక్య పోరాటానికి పిలుపునిచ్చారు.
Karimnagar: మహిళా ఐక్యతకు, ఆడపిల్లల హక్కులకు ప్రతీక బతుకమ్మ
కరీంనగర్: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోతి రాంపూర్ పోచమ్మవాడలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఐద్వా కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, మహిళల ఐక్యతను చాటిచెప్పే పండుగ అని అన్నారు. పండుగలను ఆనందంగా జరుపుకోవడంతో పాటు మహిళల హక్కుల పరిరక్షణ కోసం కూడా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
నేటి సమాజంలో ఆడపిల్లలపై వివక్ష, మహిళలపై హింస, వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు, బాల్యవివాహాలు వంటి సమస్యలు కొనసాగడం ఆందోళనకరమని అన్నారు. ఆడపిల్లలను భారంగా భావించకుండా, వారికి సమాన అవకాశాలు కల్పించి విద్యావంతులుగా తీర్చిదిద్దాలని, అన్ని రంగాల్లో స్వేచ్ఛగా ఎదిగే వాతావరణాన్ని కల్పించాలని కోరారు.
“ఆడపిల్లను పుట్టనిద్దాం.. పెరగనిద్దాం.. ఎదగనిద్దాం.. చదవనిద్దాం.. గౌరవిద్దాం” అనే నినాదంతో ప్రతి ఇంటిలో ఆడపిల్లలకు సమాన హక్కులు కల్పించాలని అన్నారు. మహిళలకు విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబన కల్పించడంతో పాటు, మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బతుకమ్మ పండుగను ప్రకృతిని ప్రేమిస్తూ, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం పోరాడే స్ఫూర్తితో జరుపుకోవాలని నాగమణి పిలుపునిచ్చారు. మహిళలందరూ ఐక్యంగా ముందుకు వచ్చి మహిళా హక్కుల సాధన కోసం ఐద్వా ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకురాలు బానోత్ రాజమణి కోనేటి శిరీష కారు పాకల మున్న భార్గవి తిరుమల రామంచ రాజవ్వ నిర్మల సుమ సౌందర్య అన్నపూర్ణ రాజా వర్దిని సంతోష తదితరులు పాల్గొన్నారు.




