Karimnagar: 6 గ్యారంటీలు గాలికి - కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు
Karimnagar: కరీంనగర్ చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేత ప్రవీణ్ రావు ఆగ్రహం. 6 గ్యారంటీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శ.
Karimnagar: 6 గ్యారంటీలు గాలికి - కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు
కరీంనగర్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ధైర్యసాహసాలకు ప్రతీక అయిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కరీంనగర్లో జరిగిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో ప్రవీణ్ రావు పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రావు ఐలమ్మ తెగువను, పోరాట పటిమను స్మరించుకుంటూనే.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను పూర్తిగా సైడ్ ట్రాక్ చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎన్నో అవినీతి ఆరోపణలు చేసి, నేడు అధికారంలోకి వచ్చాక కేవలం కేసులు పెట్టి టైమ్ పాస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో వెలుగు చూసిన వివిధ కుంభకోణాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా.. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు శూన్యమని ఎద్దేవా చేశారు. ప్రభుత్వమే స్వయంగా కేసులను లేవనెత్తి, చివరకు సాధించింది ఏంటని ఆయన నిలదీశారు. ప్రధానంగా ఫోన్ టాపింగ్, కాలేశ్వరం ప్రాజెక్టు , గొర్రెల స్కాం
ఈ-కార్ రేసింగ్ (ఫార్ములా ఈ)
ఓఆర్‌ఆర్ టెండర్, తాజాగా కెసిఆర్ ఫార్మ్ హౌస్ భూముల గొడవ , 22 ఏ అంశాలపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఆ భగవంతుడికే ఎరుకని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మూడేళ్లలో బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ సర్కార్ పెట్టిన కేసుల పురోగతిపై తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని కాలయాపన రాజకీయం చేస్తోందని ఘాటుగా విమర్శించారు.
ఏ ఒక్క కేసులోనూ బీఆర్ఎస్ నేతలపై నేటి వరకు చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి లేదని, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై చర్యలు తీసుకునే దమ్ము, ధైర్యం కాంగ్రెస్‌కు లేవని ఆయన స్పష్టం చేశారు. చాకలి ఐలమ్మ ప్రదర్శించిన చారిత్రక తెగువ, పోరాట స్ఫూర్తిని ఆయన గుర్తు చేశారు. నిరంకుశ శక్తులను ఎదిరించిన ఐలమ్మ ధైర్యంలో నూటికి ఒక్క పాళ్లు కూడా నేటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిలో లేవని, ప్రజలను మభ్యపెట్టే డైవర్షన్ రాజకీయాలు మాని ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.




