Karimnagar: స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో ముద్రించాలి!
Karimnagar: ఉచిత రేషన్ ఇస్తున్న ప్రధాని మోదీ ఫోటోను స్మార్ట్ కార్డులలో పెట్టకపోవడం విచారకరం. కరీంనగర్ బీజేపీ నేత యాదగిరి సునీల్ రావు డిమాండ్.
Karimnagar: స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో ముద్రించాలి!
Karimnagar: దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 21 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు, దాదాపు 90 కోట్ల మంది జనాభాకు ప్రతినెల ఒక్కొక్క వ్యక్తికి ఉచితంగా ఐదు కేజీల బియ్యం అందించడం జరుగుతుందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు.
ఆదివారం ఓ ప్రకటనలో యాదగిరి సునిల్ రావు మాట్లాడుతూ... గత ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియను రాబోయే 2031 సంవత్సరం వరకు పొడిగించడం జరిగిందని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ పేద ప్రజలు ఆకలితో అలమటించకూడదనే గొప్ప ఉద్దేశంతో 'ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన' పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది ప్రజలకు రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 5 కిలోల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్రంలోని 2 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ బియ్యం అందిస్తూ ఉంటే... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిన్నటి నుండి జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టకపోవడం చాలా బాధాకరమని అన్నారు.
దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ అత్యున్నతమైన పదవిలో ఉన్న ప్రధానమంత్రి గారి ఫోటోను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల్లో ముద్రించకపోవడం విచారకరం అన్నారు. అంతే కాకుండా దేశంలోని మిగతా రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద 2 కోట్ల మంది ప్రజలకు మోడీ ఉచితంగా బియ్యం అందిస్తున్న గొప్ప నేత కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ విధానాన్ని ఉల్లంఘించి ఇలాంటి చర్యకు పాల్పడటం శోచనీయమన్నారు.
స్మార్ట్ రేషన్ కార్డులో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను ముద్రించకుండా... రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం చాలా బాధాకరమన్నారు. ప్రజలకు అందించే నూతన స్మార్ట్ రేషన్ కార్డులలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సివిల్ సప్లయ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫొటోలు ఏర్పాటు చేయడం తమ ప్రభుత్వ నిర్ణయం అయినప్పటికీ... కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని 2 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ బియ్యం అందుతున్నాయి.
కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను కూడా ముద్రించాల్సిందని డిమాండ్ చేశారు.కేంద్ర నిధుల ద్వారా ఏ రాష్ట్రంలో ఏ కార్యక్రమం లేదా పథకం చేపట్టినా, సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క ఫోటోలను విధిగా పెట్టి కేంద్ర ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపారు.
ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇట్టి విషయాన్ని గమనించి అట్టి నిర్ణయాన్ని సరిదిద్దుకోవాలని సూచించారు.
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉచిత రేషన్ బియ్యం అందుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం 2031 వరకు కొనసాగడం జరుగుతుందని ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నూతన స్మార్ట్ రేషన్ కార్డులలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను ముద్రించి గౌరవించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించినా కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాన్ని పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.




