Karimnagar: నవంబర్ 29న అలుగునూర్‌లో దీక్షా దివస్ భారీ సభ: బీఆర్ఎస్!

Karimnagar: నవంబర్ 29న అలుగునూర్‌లో 50 వేల మందితో దీక్షా దివస్ భారీ బహిరంగ సభ, నవంబర్ 11-14 మధ్య కేటీఆర్ బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 1 Nov 2026 9:00 PM IST
Karimnagar
X

Karimnagar: నవంబర్ 29న అలుగునూర్‌లో దీక్షా దివస్ భారీ సభ: బీఆర్ఎస్!

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ 2009 నవంబర్ 29న అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ అలుగునూర్ వద్ద అరెస్టయిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నది. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలను ప్రధానంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో నవంబర్ 11 నుంచి 14వ తేదీ మధ్య రెండు రోజులపాటు ప్రత్యేక బస్సు యాత్ర నిర్వహించనున్నారు. మేడిగడ్డ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల మీదుగా కొనసాగుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించనున్నది.

ఈ కార్యక్రమాల నిర్వహణపై కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్వేతా హోటల్‌లో నేడు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. దీక్షా దివస్ ఉత్సవాల నిర్వహణ, కేటీఆర్ బస్సు యాత్ర, రైతుల సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలు, భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు.

మేడిగడ్డ నుంచి బస్సు యాత్ర...

రైతుల సాగునీటి సమస్యలను ప్రధాన అంశంగా చేసుకొని కేటీఆర్ నేతృత్వంలో రెండు రోజులపాటు బస్సు యాత్ర నిర్వహించనున్నారు. నవంబర్ 11 నుంచి 14వ తేదీ మధ్య అనువైన రెండు రోజులను ఖరారు చేయనున్నారు. మేడిగడ్డ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రధాన ప్రాజెక్టుల మీదుగా కొనసాగుతుంది. ఆయా ప్రాజెక్టుల పరిస్థితి, రైతులకు అందుతున్న సాగునీరు, నీటి పంపిణీ, ప్రాజెక్టుల ద్వారా కలగాల్సిన ప్రయోజనాలు, ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలిస్తూ ప్రజలకు వివరించనున్నారు.

గతంలో రైతులకు అందిన సాగునీరు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వ నిర్ణయాల వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆధారాలతో ప్రజల ముందుంచాలని సమావేశంలో చర్చించారు. సాగునీటితోపాటు తాగునీరు, విద్యుత్ సమస్యలు, గ్రామీణ ప్రాంతాల ఇబ్బందులను కూడా ప్రజాక్షేత్రంలో ప్రస్తావించనున్నారు.

అలుగునూర్‌లో దీక్షా దివస్ సభ...

నవంబర్ 29న దీక్షా దివస్ సందర్భంగా మానకొండూరు నియోజకవర్గంలోని అలుగునూర్ లేదా నుస్తులాపూర్ ప్రాంతంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ సభకు సుమారు 50 వేల మంది ప్రజలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ అరెస్టు జరిగిన అలుగునూర్ చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేస్తూ దీక్షా దివస్ ప్రాధాన్యతను ప్రజలకు వివరించనున్నారు.

రైతు సమస్యలు, సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి, కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రభుత్వ వైఖరి, రైతులకు సాగునీరు అందించాలనే డిమాండ్ ఈ సభలో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. సభ నిర్వహణకు సంబంధించి ప్రాంత ఎంపిక, జన సమీకరణ, ఇతర ఏర్పాట్లపై నాయకులు చర్చించారు.

రైతుల సమస్యలే ప్రధాన ఎజెండా....

ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన నిలబడటం, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం రాజకీయ పార్టీల బాధ్యత అని సమావేశంలో నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రైతులు సాగునీరు, తాగునీరు, విద్యుత్ సమస్యలతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. గతంలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు అందిన ప్రయోజనాలను, ప్రస్తుత పరిస్థితులను పోల్చి ప్రజలకు వివరించనున్నారు.

బస్సు యాత్రతోపాటు గ్రామస్థాయిలో కరపత్రాలు, పోస్టర్లు, సోషల్ మీడియా, స్థానిక సమావేశాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని కార్యాచరణ రూపొందించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి దీక్షా దివస్ కార్యక్రమాలను నిర్వహించాలని చర్చించారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తోపాటు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి, పార్టీ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, విద్యాసాగర్ రావు, పుట్ట మధు, కోరుకంటి చందర్, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, దేవేందర్ రెడ్డి, కోలేటి దామోదర్, కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు జి.వి. రామకృష్ణారావు, సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య, కొండూరు రవీందర్ రావు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత, సిద్ధం వేణు, కరీంనగర్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు ఏనుగు రవీందర్ రెడ్డి, పొన్నం అనిల్ కుమార్, కొత్త శ్రీనివాస్ రెడ్డి, రఘువీర్ సింగ్, తిరుపతి నాయక్,తదితర నాయకులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN