Karimnagar: కరీంనగర్ అభివృద్ధికి బీఆర్ఎస్ రావాలి.. గంగుల కమలాకర్

Karimnagar: కరీంనగర్‌లో ఫోర్ వీలర్స్ అసోసియేషన్ భవనం ప్రారంభించిన గంగుల కమలాకర్; బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని, రెండేళ్లలో వెంకటేశ్వర ఆలయం పూర్తి చేస్తామని వెల్లడి.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 20 Nov 2026 11:43 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ అభివృద్ధికి బీఆర్ఎస్ రావాలి.. గంగుల కమలాకర్

కరీంనగర్: కరీంనగర్ నగరం మళ్లీ అభివృద్ధి పథంలో పయనించాలంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, భవిష్యత్తులోనూ నిలిచిపోయిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి కరీంనగర్‌ను హైదరాబాద్ తర్వాత అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్ సమీపంలో నూతనంగా నిర్మించిన ఫోర్ వీలర్స్ అసోసియేషన్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యేకు అసోసియేషన్ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. టపాసులు పేల్చి, ఆనందోత్సాహాల మధ్య సంబరాలు నిర్వహించారు. అనంతరం గంగుల కమలాకర్ రిబ్బన్ కట్ చేసి నూతన భవనాన్ని ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో అసోసియేషన్ సభ్యులు, నిర్వాహకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

అసోసియేషన్ భవన నిర్మాణానికి గతంలోనే తన వంతుగా రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు గంగుల గుర్తుచేశారు. సంఘం సభ్యుల సౌకర్యార్థం వేసవిని దృష్టిలో ఉంచుకుని త్వరలోనే భవనంలో ఏసీలు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అసోసియేషన్ సమావేశాలు, ఇతర కార్యక్రమాలు లేని సమయాల్లో భవనాన్ని సామాన్య ప్రజల శుభకార్యాలకు తక్కువ అద్దెకు కేటాయించాలని సూచించారు. దీని ద్వారా సంఘానికి కొంత ఆదాయం సమకూరడంతో పాటు భవన నిర్వహణకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందని అన్నారు. సంఘాల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.

గత పదేళ్లలో నగర రూపురేఖలు మార్చాం..

గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కరీంనగర్ నగర రూపురేఖలు మార్చేలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గంగుల కమలాకర్ వివరించారు. నగరంలో విశాలమైన రహదారుల నిర్మాణం, ఐటీ టవర్, మానేరు రివర్ ఫ్రంట్, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం వంటి అనేక ప్రతిష్ఠాత్మక పనులను చేపట్టి కరీంనగర్‌ను అభివృద్ధి దిశగా తీసుకెళ్లామని తెలిపారు. అప్పట్లో నగరాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి కోట్లాది రూపాయల నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు.

అయితే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో నగర అభివృద్ధి కుంటుపడిందని, పలు ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు వీధిలైట్ల సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. నగరంలో గతంలో ప్రారంభించిన పలు అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల ఆశీస్సులతో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే నిలిచిపోయిన పనులన్నింటినీ రాకెట్ వేగంతో పూర్తి చేస్తామని చెప్పారు. కరీంనగర్‌ను మరింత సుందరంగా, ఆధునిక సౌకర్యాలతో కూడిన నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

రెండేళ్లలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం పూర్తి..

కరీంనగర్‌లో భక్తుల చిరకాల ఆకాంక్షగా ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులలు ప్ర్రారంభం ఇయ్యాయాని రెండేళ్లలోపు పూర్తి అవుతుందని తద్వారా నగరంలోని భక్తులకు ఆ స్వామి వారిని దర్శించుకునే భాగ్యం కలుగుతున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా కరీంనగర్ నిలుస్తుందని పేర్కొన్నారు.

ఫోర్ వీలర్స్ అసోసియేషన్ నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా సభ్యులు, నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. తమ సంఘం భవన నిర్మాణానికి సహకరించడంతో పాటు భవిష్యత్తులోనూ అవసరమైన సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చిన గంగుల కమలాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని వారికి బహుకరించారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆల్ ఫోర్ వీలర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షులు వడ్లూరి శ్రీనివాస్,అధ్యక్షులు కానిగంటి రమేష్,ఉపాధ్యక్షులు యం.డి. షాఫీరుద్దీన్ బాబా జెనరల్ సెక్రటరీ జాప మునిందర్ రెడ్డి, సహాయ ప్రధానకార్యదర్శి మట్టెల బాబు, అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR