Karimnagar: ఆరుతడి పంటలపై కలెక్టర్ చిత్రా మిశ్రా సమీక్ష!
Karimnagar: కరీంనగర్‌లో ఆరుతడి పంటలపై కలెక్టర్ చిత్రా మిశ్రా సమీక్ష. సాగు విస్తీర్ణం 16 వేల ఎకరాలకు చేరిక. ప్రత్యామ్నాయాలపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశం.
Karimnagar: ఆరుతడి పంటలపై కలెక్టర్ చిత్రా మిశ్రా సమీక్ష!
Karimnagar: జిల్లాలో పెద్ద ఎత్తున ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. ఆరుతడి పంటల సాగు వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించి, ప్రత్యామ్నాయ పంటల వైపు వారిని ప్రోత్సహించాలని సూచించారు.
కలెక్టర్ ఛాంబర్‌లో వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యామ్నాయ పంటలు, ఆరుతడి పంటల సాగుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో గత సంవత్సరం ఆరుతడి పంటల సాగు విస్తీర్ణం, ప్రస్తుత సంవత్సరం సాగు చేసిన విస్తీర్ణం తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గత సంవత్సరం జిల్లాలో సుమారు 6 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు కాగా, ఈ సంవత్సరం ఇప్పటివరకు 16 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆరుతడి పంటల సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహించి, ఆరుతడి పంటల సాగు, ప్రత్యామ్నాయ పంటల వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.
మొక్కజొన్న, వేరుశనగ, ఆయిల్‌పామ్‌తో పాటు కూరగాయలు, పండ్ల తోటల సాగుపై రైతులు ఆసక్తి చూపేలా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో రైతులకు అందుబాటులో ఉండేలా వ్యవసాయ శాఖ సిబ్బంది పనిచేస్తూ, పంటల ఎంపిక నుంచి సాగు విధానాల వరకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, హుజురాబాద్ వ్యవసాయ అధికారి భూమ్ రెడ్డి, జమ్మికుంట వ్యవసాయ అధికారి ఖాదర్ హుస్సేన్‌తో పాటు పలువురు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.




