Karimnagar: రైతులకు సకాలంలో యూరియా అందించాలి.. కలెక్టర్ చిత్రా మిశ్రా
Karimnagar: కరీంనగర్ జిల్లాలో వానాకాలం సాగుకు యూరియా కొరత లేకుండా చూడాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశం.
Karimnagar: రైతులకు సకాలంలో యూరియా అందించాలి.. కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్: వానాకాలం వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైతులకు యూరియా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో యూరియా సరఫరాపై జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వ్యవసాయ శాఖ అధికారులు, ఏడీఏలు, సహకార శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 556 కేంద్రాల ద్వారా యూరియా సరఫరా జరుగుతోందని, వాటిలో 170 ప్రభుత్వ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 2 లక్షల 98 వేల యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని, గత నాలుగు రోజుల్లో దాదాపు లక్ష పదివేల బస్తాలు రైతులకు పంపిణీ చేసినట్లు చెప్పారు.
యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న రైతులకు 48 గంటల్లోగా యూరియా అందించాలని అధికారులను ఆదేశించారు. బుకింగ్ విధానం తెలియని రైతులకు వ్యవసాయ అధికారులు, సిబ్బంది సహాయం చేసి నమోదు చేయించాలని సూచించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సరఫరా ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ, యూరియా పంపిణీ కేంద్రాల వద్ద అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని చెప్పారు. ఏవైనా సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటే ముందస్తుగా పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, డీసీఓ రామానుజాచార్యులు, ఇన్‌చార్జి సీఈఓ పవన్ కుమార్, జిల్లా స్థాయి అధికారులు, ఏడీఏలు, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




