Karimnagar: భూముల రీ-సర్వే వేగవంతం చేయాలి.. కరీంనగర్ కలెక్టర్

Karimnagar: కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా భూముల సర్వే, రీ-సర్వే ప్రక్రియపై అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 11 July 2026 8:55 AM IST
Karimnagar
X

Karimnagar: భూముల రీ-సర్వే వేగవంతం చేయాలి.. కరీంనగర్ కలెక్టర్

కరీంనగర్: జిల్లాలో చేపడుతున్న భూముల సర్వే, రీ-సర్వే ప్రక్రియను మరింత వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సాదా బైనామా–భూభారతి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రతి అంశంలో అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ ప్రజలకు వేగంగా సేవలు అందించాలన్నారు.

కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆర్డీవోలు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులతో భూముల సర్వే, రీ-సర్వే, భూభారతి–సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం, ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో చేపట్టిన భూముల సర్వే నంబర్లపై రీ-సర్వే పనులను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో మొత్తం 70 గ్రామాల్లో భూముల సర్వే నంబర్లపై సర్వే చేపడుతున్నామని, ఇప్పటికే ఏడు గ్రామాల్లో పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. మిగిలిన గ్రామాల్లో కూడా యుద్ధ ప్రాతిపదికన సర్వే నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలో సుమారు 94,637 ఎకరాల భూముల సర్వే చేపట్టనున్నట్లు పేర్కొన్న కలెక్టర్, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరిని చేరుకోవాలని ఆదేశించారు.

అందరికీ ఎనిమరేషన్ దరఖాస్తులు అందేలా చూడాలన్నారు. ప్రతి 10 మంది బీఎల్‌వోలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి, పకడ్బందీగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రెవెన్యూ సదస్సుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

అనంతరం గృహ నిర్మాణ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మరియు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించి, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీవోలు షర్మిల, జలకుమారి, గృహ నిర్మాణ శాఖ అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు మోబిన్, కాలీచరణ్, మాధవితో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story