Karimnagar: విపత్తుల నిర్వహణపై కరీంనగర్ కలెక్టరేట్‌లో సమీక్ష

Karimnagar: వర్షాకాలం నేపథ్యంలో కరీంనగర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తం. ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశం.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 26 Jun 2026 9:15 AM IST
Karimnagar
X

Karimnagar: విపత్తుల నిర్వహణపై కరీంనగర్ కలెక్టరేట్‌లో సమీక్ష

కరీంనగర్: వర్షాకాలం నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. ఎలాంటి విపత్తులు ఎదురుకాకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు.

కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వర్షాకాల సన్నద్ధత, విపత్తుల నిర్వహణపై జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రెవెన్యూ, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, పంచాయతీరాజ్, పోలీస్, ఫైర్, వైద్య ఆరోగ్య, విద్య తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల్లో భారీ వర్షాలు, వరదల పరిస్థితుల్లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు.

రహదారులు, వంతెనలు, చెరువుల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కరీంనగర్ నగరంలో వర్షపు నీరు నిల్వ కాకుండా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖలు క్రిటికల్ రిపేర్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఫైర్ శాఖ విపత్తు నిర్వహణ పరికరాలు, యంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని, వైద్య ఆరోగ్య శాఖ అవసరమైన మందులు అందుబాటులో ఉంచి ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, తాగునీటి పైపుల్లో లీకేజీలు లేకుండా పర్యవేక్షించాలని సూచించారు.

లోతట్టు ప్రాంతాల్లో ముంపు నివారణకు మురుగునీటి కాల్వల్లో పూడిక తొలగింపు పనులు వేగవంతం చేయాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అత్యధిక వర్షాల కారణంగా నష్టం జరిగే ప్రాంతాల్లో బాధితులకు అవసరమైన వసతులు కల్పించేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక (ప్లాన్ ఆఫ్ యాక్షన్) సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. శాఖల వారీగా అవసరమైన వనరులు, సిబ్బంది కొరత ఉంటే వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ, వర్షాకాలంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా పనిచేస్తుందని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టి ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అత్యవసర పరిస్థితులపై ముందస్తు సమాచారాన్ని సంబంధిత అధికారులు పోలీస్ శాఖతో పంచుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు, డివిజన్ స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story