Karimnagar: స్వీయ గణనతో జనగణనను విజయవంతం చేయండి!
Karimnagar: కరీంనగర్ జిల్లాలో డిజిటల్ జనగణన 2027 ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు స్వీయ గణన చేసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు.
Karimnagar: స్వీయ గణనతో జనగణనను విజయవంతం చేయండి!
Karimnagar: జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రతి ఒక్కరు తమ వివరాలను స్వయంగా నమోదు( స్వీయ గణన) చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కోరారు. జిల్లాలో చేపడుతున్న జన గణనలో భాగంగా స్వీయ గణన కార్యక్రమంపై ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రెస్ మీట్ నిర్వహించారు. స్వీయ గణన ప్రక్రియపై పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వీయ గణనలో ప్రతి కుటుంబం తమ గృహానికి సంబంధించిన వివరాలను స్వయంగా ఆన్లైన్ ద్వారా ఫోన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఇది సులభమైన సురక్షితమైన పారదర్శకమైన విధానమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్వీయ గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు 15 రోజులపాటు కొనసాగుతుందన్నారు..
జనాభా గణనలో గృహముల నివాసయోగ్య స్థితి, వసతులు మతము, షెడ్యూల్ కులాలు, షెడ్యూలు తెగలు, కుటుంబ యజమాని పేరు త్రాగునీటి వసతి గృహ వినియోగం ఇంధనం వంటి వివరాలతో కూడిన 34 రకాల ప్రశ్నలు ఉంటాయని తెలిపారు. ఈ సమాచారం దేశ ప్రగతి .అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. వెబ్ పోర్టల్ అడ్రస్ se.censes.giv.in
ఈ పోర్టల్ ద్వారా ప్రజల తమ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి గృహాన్ని జియో ట్యాగ్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. నమోదు పూర్తయిన తర్వాత హెచ్ తో ప్రారంభమయ్యే 11 అంకెల సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడి జనరేట్ అవుతుందన్నారు. ప్రజలు తమ కుటుంబ వివరాలను సుమారు 15 నిమిషాల్లో నమోదు చేసి ఈ ప్రత్యేకమైన సెల్ఫ్ ఇన్వరేషన్ ఐడి పొందవచ్చన్నారు. స్వీయ గణన నమోదు అనంతరం వచ్చిన ఐడిని భద్రపరచుకొని ఇండ్ల
గణన సమయంలో ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్ కు ఐడి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. గృహాల జాబితా లెక్కింపు సమయం ఎన్యుమరేటర్లు సూపర్వైజర్ల ద్వారా తమ తమ కుటుంబ వివరాలను ధ్రువీకరిస్తారని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో డిజిటల్ జనగణన నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు అనుబంధ కార్యాలయాలు సంస్థల అధికారులు ఉద్యోగులు స్వీయ గణనలో పాల్గొనేలా ప్రజలు పౌరులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సూచించారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు.
జిల్లాలో వివిధ శాఖల అధికారులు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులు మెడికల్ సిబ్బంది క్రీడాకారులు కళాకారులు జనాభా గణన విధులు నిర్వర్తిస్తున్న అధికారులు బ్యాంకింగ్ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు అంగన్వాడి ఏఎన్ఎం ఆశా వర్కర్లు ప్రజలు స్వీయ గణనలో పాల్గొనేలా కృషి చేసేందుకు బాధ్యతాయుత అధికారులను నియమించామని తెలిపారు. ప్రజల నుంచి సేకరించిన ఈ సమాచారం గోప్యంగా భద్రపరుస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు నిర్భయంగా వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
జనాభా గణన తొలిదశ మే 11 నుంచి ప్రారంభం..
జనాభా గణన తొలిదశ మే 11 నుంచి ప్రారంభమవుతుందని జూన్ 10 వరకు కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇందులో ఏన్యూమరేటర్లు ఇండ్ల జాబితా గణన చేపడతారని పేర్కొన్నారు.హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (హెచ్ఎల్వో)లో భాగంగా బ్లాకులవారీగా ఇళ్లకు నెంబర్లు కేటాయిస్తామన్నారు. రెండో దశలో 2027 ఫిబ్రవరి 9 నుంచి 25 వరకు వ్యక్తిగత వివరాల సేకరణ ఉంటుందని వివరించారు.
స్థానికులతోపాటు ఇతర రాష్ట్రాలు, జిల్లాల వారు కూడా ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతంలోనే జనగణనలో పాల్గొనాలని సూచించారు. పౌరుల వ్యక్తిగత వివరాలు అత్యంత గోప్యంగా ఉంటాయని జిల్లా కలెక్టర్ చెప్పారు. ఆధార్, ఓటర్ ఐడీ రేషన్ కార్డు నెంబర్లు, ఇతర డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. స్వీయ గణన సందర్భంగా ఏమైనా ఇబ్బందులు తలెత్తినా సమస్యలు వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ 1855లో కాల్ చేయవచ్చని పేర్కొన్నారు.
జన గణనలో భాగంగా జిల్లాస్థాయిలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. మండల స్థాయిలో చార్జ్ ఆఫీసర్లు తాసిల్దారులు అర్బన్ లో మున్సిపల్ కమిషనర్లు వ్యవహరిస్తారని తెలిపారు. జిల్లాలోని 16 మండలాలు జమ్మికుంట హుజురాబాద్ చొప్పదండి మున్సిపాలిటీలు కలుపుకొని 1227 హౌస్ లిస్టింగ్ బ్లాక్లుగా విభజించామని పేర్కొన్నారు. ఇందులో మొత్తం 1234 మంది ఎన్యుమరేటర్లు
215 మంది సూపర్వైజర్లు జనగణలో పాల్గొంటారని తెలిపారు. కరీంనగర్ కరీంనగర్ నగర పాలక సంస్థలో 666 బ్లాకులుగా విభజించామని 733 మంది ఎన్యుమరేటర్లు 122 మంది సూపర్వైజర్లు విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. వీరందరికీ జన గణనపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
జిల్లా ప్రజలంతా స్వీయ గణనతో పాటు జనాభా గణనలో స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో పక్కాగా జనాభా గణన నిర్వహించేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజలంతా స్వీయ గణన చేసుకోవాలని తద్వారా జనాభా గణనకు సహకరించాలని కోరారు.
దీనిపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరాలు గోప్యంగా ఉంచబడు తాయని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ డి శ్రీనివాస్ రెడ్డి,ఆర్డీవో కే మహేశ్వర్ జిల్లా ప్రణాళిక అధికారి రామ్ దత్తారెడ్డి ఎస్ఓ కిషన్ రావు, జిల్లా సెన్సెస్ ఇన్చార్జి తిరుపతి పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
స్వీయగణన ప్రక్రియ ఇలా..
https://se.census.gov.in
పోర్టల్ లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. రాష్ట్రం (తెలంగాణ) ఎంపిక చేసి.. పైన కనిపించే క్యాప్చా ఎంటర్ చేయాలి. కుటుంబ యజమాని పేరు నమోదు చేయాలి. యజమాని పేరు ఒక్కసారి నమోదు చేస్తే సవరణకు అవకాశం ఉండదు. కుటుంబంలోని ఎవరిదైనా మొబైల్ నెంబరు ఎంటర్ చేయాలి. ఒక మొబైల్ నెంబరుతో ఒక కుటుంబం వివరాల నమోదుకు మాత్రమే అవకాశం ఉంటుంది.
ఈ మెయిల్ ఎంటర్ చేయాలి (ఆప్షనల్). అనంతరం మొబైల్ నెంబరుతోపాటు ఈ మెయిల్ కు ఐడీ నెంబరు వస్తుంది. కావాల్సిన భాషను ఎంచుకొని.. పైన ఎంటర్ చేసిన మొబైల్ నెంబరుకు వచ్చే వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) ఎంటర్ చేయాలి. ఒకసారి భాష ఎంచుకున్న తర్వాత మార్చడం కుదరదు.
జిల్లాను ఎంచుకొని పిన్కోడ్, గ్రామం/నగరం, ప్రాంతం, స్థానిక ల్యాండ్ మార్క్ ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయాలి. ఆయా వివరాల ఆధారంగా కనిపించే మ్యాప్ లో ఎర్రటి రంగులో కనిపించే మార్కర్ ద్వారా మీ ఇళ్లు ఎక్కడ ఉందో సరిగా గుర్తించాలి. (భవనంపై మార్కర్ ఉండేలా ఎంచుకో వాలి). వివరాలు సేవ్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. ఇది ఎన్యు మరేటర్ క్షేత్రస్థాయి పర్యటనలో మీ ఇంటికి సులువుగా వచ్చేందుకు దోహదపడుతుంది.
అనంతరం 33 అంశాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. ఇందులో 27 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. భవనం నెంబరు, సెన్సస్ హౌస్ నెంబరు వంటి ఆరు ప్రశ్నలకు సంబంధించి ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు సమాచారం ఇవ్వాలి.
మీరు ఇచ్చిన సమాచారం సరిగా ఉందా..? లేదా..? అన్నది ప్రివ్యూ ఆప్షన్ పై క్లిక్ చేసి చెక్ చేసుకోవాలి. అంతా సక్రమంగా ఉందనుకుంటే ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేయాలి. సవరణ కావాలంటే ఎన్యుమరేటర్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఇంటికి వచ్చినప్పుడు చేసుకోవాలి.
ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత హెచ్ అనే అక్షరంతోపాటు 11 అంకెలతో ఐడీ నెంబరు మొబైల్ నెంబరు/ఈ మెయిల్ కు వస్తుంది. ఈ గుర్తింపు సంఖ్యను ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు చెబితే యాప్ లో చెక్ చేసి. మీ వివరాలకు సంబంధించిన సమాచారం క్రాస్ చెక్ చేస్తారు. అనంతరం మీ స్వీయ జన గణనను ఆమోదిస్తూ సబ్మిట్ చేయడంతో జనగణన నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.




