Karimnagar: మలేరియాపై యుద్ధం.. కరీంనగర్ జిల్లా కలెక్టర్ అలర్ట్!
Karimnagar: వర్షాకాలం నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు.
Karimnagar: మలేరియాపై యుద్ధం.. కరీంనగర్ జిల్లా కలెక్టర్ అలర్ట్!
కరీంనగర్: ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా వైద్యులు, వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కలెక్టర్ తన చాంబర్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, ఇమ్యునైజేషన్ అధికారులు, వైద్యాధికారులు, ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, ఎస్టాబ్లిష్‌మెంట్, అకౌంట్స్ సూపరింటెండెంట్లు, ఏవో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాలు, పాఠశాలలు, గ్రామపంచాయతీల్లో పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించాలని ఆదేశించారు.మహిళలు, బాలికలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన కలెక్టర్, ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పేర్కొన్నారు.
ప్రతి అర్హులైన చిన్నారికి టీకాలు అందేలా కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఇతర వైద్య సిబ్బంది సమన్వయంతో గ్రామ గ్రామాన సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో వైద్య సేవల్లో ఎలాంటి జాప్యానికి తావులేకుండా చూడాలని స్పష్టం చేశారు.
జిల్లా స్థాయిలో సమగ్ర హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని, క్షయవ్యాధి, మధుమేహం తదితర దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.
మాతా శిశు ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్, అవసరమైన చోట్ల మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీల నిర్వహణ తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ సేవల నాణ్యత పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో, ఇమ్యునైజేషన్ అధికారులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.




