Karimnagar: ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించాలి కలెక్టర్ చిత్రా మిశ్రా

Karimnagar: కరీంనగర్‌లో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంచాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ చిత్రా మిశ్రా. ఏఈవోలకు ప్రత్యేక టార్గెట్లు కేటాయింపు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 24 July 2026 7:48 PM IST
Karimnagar
X

Karimnagar: ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించాలి కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్: దీర్ఘకాలంగా లాభాలు అందించే ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్ లోని తన చాంబర్ లో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆయా శాఖల అధికారులతో ఆయిల్ ఫాం సాగు పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఆయిల్ ఫాం సాగు విస్తీర్ణం, నిర్దేశించుకున్న లక్ష్యం తెలుసుకున్నారు. రైతువేదికల ద్వారా, గ్రామపంచాయతీల ద్వారా ఆయిల్ ఫామ్ సాగుతో కలిగే లాభాలు, ప్రభుత్వ రాయితీలను రైతులకు వివరించాలని సూచించారు.

మండలాల వారీగా, గ్రామాల వారీగా ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న, సాగుకు ఆసక్తి ఉన్న రైతుల వివరాలు తయారు చేయాలని ఆదేశించారు. ఎల్ నినో - వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆయిల్ ఫామ్ సాగు రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని.. సాగు విస్తీర్ణం పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు.

అవసరమైతే జిల్లాలోనే ఆయిల్ ఫామ్ నర్సరీకి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగు చేస్తూ లాభాలు పొందుతున్న రైతుల తోటల వద్దకు సాగుకు ఆసక్తి ఉన్న వారిని తీసుకెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ఏఈవోలకు 25 ఎకరాల చొప్పున టార్గెట్ నిర్దేశించి చేరుకునేలా పర్యవేక్షించాలన్నారు.

ఉన్నతాధికారులతో మాట్లాడి జిల్లాకు మరిన్ని మొక్కలు తెప్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో గత నాలుగేళ్లలో 2640 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటించామని.. ఈ ఏడాది వెయ్యి ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 767 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశామని .. అందులో 474 ఎకరాలకు సంబంధించిన రైతులు.. 90 శాతం సబ్సిడీ పోను ఒక్కో మొక్కకు 20 చెల్లించారని అధికారులు.. కలెక్టర్ కు విన్నవించారు.

ఇప్పటివరకు 180 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటించామని.. మరో 170 ఎకరాల్లో త్వరలోనే మొక్కలు నాటించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఆయిల్ ఫామ్ మొక్కలకు నీటిని అందించేందుకు ఎస్సీ ఎస్టీ రైతులకు 90 శాతం, సన్న కారు రైతులకు 80 శాతం, సాధారణ రైతులకు 70 శాతం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story