Karimnagar: కరీంనగర్‌లో తాగునీటి సమస్యపై కలెక్టర్ సమీక్ష
Karimnagar: కరీంనగర్ జిల్లాలో ఎల్ నినో ప్రభావంతో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.
Karimnagar: కరీంనగర్‌లో తాగునీటి సమస్యపై కలెక్టర్ సమీక్ష
కరీంనగర్: ఎల్ నినో ప్రభావంతో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. మిషన్ భగీరథతో పాటు ఇతర తాగునీటి సరఫరా వ్యవస్థల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులతో తాగునీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల పరిధిలో రోజువారీ నీటి అవసరాలు, సరఫరా పరిస్థితులు, నీటి పొదుపు కోసం చేపడుతున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఎక్కడైనా తాగునీటి పైపులైన్లకు లీకేజీలు ఏర్పడితే వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. వార్డుల వారీగా పనిచేస్తున్న బోర్లు, వినియోగంలో లేని బోర్లను గుర్తించి అవసరమైన మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.
కార్పొరేషన్ పరిధిలోని కొత్తపల్లి–ఎలగందుల, బొమ్మకల్, విద్యారణ్యపురి, అలుగునూరు, చింతకుంట ప్రాంతాలతో పాటు ఇటీవల విలీనమైన గ్రామాల్లో తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే జమ్మికుంట, హుజురాబాద్, చొప్పదండి మున్సిపాలిటీలు, గంగాధర, గన్నేరువరం మండలాల్లో నీటి అవసరాలు, వినియోగం, సరఫరా పరిస్థితులను సమీక్షించారు.
ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లో నీటి నిల్వలను ప్రతిరోజూ పర్యవేక్షించాలని, డెడ్ స్టోరేజ్ పరిస్థితి ఏర్పడకముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గన్నేరువరం మండలంలోని హనుమాజిపల్లి–జంగంపల్లి ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అలాగే గంగాధర మండలంలోని నారాయణపూర్ చెరువు నీటిని గంగాధర, చొప్పదండి మండలాల తాగునీటి అవసరాలకు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు.
సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా ఓవర్‌హెడ్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని, పైపులైన్ లీకేజీలు, నిర్వహణ లోపాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించి నీటి వృథాను అరికట్టాలని అధికారులకు ఆదేశించారు.
జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లో నీటి పొదుపుపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరించాలని, అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఈఈలు రామ్‌కుమార్, సందీప్‌కుమార్, పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్‌రావు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.




