Karimnagar: డ్రగ్స్ సరఫరాదారులపై ఉక్కుపాదం మోపాలి
Karimnagar: కరీంనగర్ నార్కోటిక్స్ కమిటీ సమావేశంలో డ్రగ్స్, గంజాయిపై కలెక్టర్ చిత్రా మిశ్రా కఠిన ఆదేశాలు; 570 గ్రాముల గంజాయి స్వాధీనం, నలుగురి అరెస్టు.
Karimnagar: డ్రగ్స్ సరఫరాదారులపై ఉక్కుపాదం మోపాలి
కరీంనగర్: డ్రగ్స్, గంజాయి తదితర మత్తుపదార్థాల వినియోగంతో జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని.వాటిని తయారు చేస్తున్న వారిపై, సరఫరా చేస్తున్న వారిపై ఉక్కు పాదం మోపి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని ఐడీఓసీలో జిల్లాస్థాయి నార్కోటిక్స్ నియంత్రణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, డీఆర్ఓ స్వామి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ దుష్పరిణామాలపై విద్యాసంస్థల్లో, ఊరూరా అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు. డ్రగ్స్ సరఫరా, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపాలని పోలీస్, ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ అధికారులను ఆదేశించారు. తరచుగా హాస్టళ్లు, మెడికల్ షాపులు, పాన్ షాపులతో పాటు అనుమానిత ప్రదేశాలను తరచుగా తనిఖీ చేస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.
విద్యాసంస్థల పరిసరాల్లో దృష్టి సారించాలి..
విద్యాసంస్థల పరిసరాల్లోని దుకాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.జిల్లాలో నమోదవుతున్న గంజాయి కేసులు, మాదకద్రవ్యాల నియంత్రణకు అధికారులు తీసుకుంటున్న చర్యలను శాఖల వారీగా తెలుసుకున్నారు.డ్రగ్స్ బారిన పడితే ఆరోగ్యం, ఆలోచన శక్తి క్షీణిస్తుందన్నారు.ఇంట్లో తల్లిదండ్రులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రవర్తనను నిరంతరం గమనించాలన్నారు. విద్యార్థులు డ్రగ్స్ జోలికి వెళ్లకుండా పట్టిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.గంజాయి రూపంలో చాక్లెట్లు వస్తున్నాయని.. చాక్లెట్లు ఇతర తినుబండారాల విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు.
బానిసలను నేరస్తులుగా చూడొద్దు..
మత్తుకు బానిసైన వారిని నేరస్తులుగా చూడకుండా వారికి చికిత్స, సరైన కౌన్సెలింగ్ అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. డ్రగ్స్ కట్టడికి పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను, నమోదు చేసిన కేసుల వివరాలను సీపీ గౌస్ ఆలం వివరించారు.
డ్రగ్స్ పర్యవసనాలపై విద్యా సంస్థల్లో అవగాహన కల్పిస్తున్నట్లు డీసీపీఓ పర్వీన్ తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ, నషా ముక్త్ భారత్ లో భాగంగా ప్రతి పాఠశాలలో ఒక టీచర్ను నియమించి.. డ్రగ్స్ కట్టడికి కృషి చేస్తున్నట్లు ఇన్చార్జి డీఈఓ తిరుపతిరావు పేర్కొన్నారు.
ఇటీవల పట్టుబడిన గంజాయి కేసులను టాస్క్ ఫోర్స్ సీఐ దుర్గాభవాని వివరించారు. గత నెలలో 10 పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. 570 గ్రాముల గంజాయి సీజ్ చేసి నలుగురిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) చట్టం ప్రకారం కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.




