Karimnagar: కరీంనగర్ హాస్టళ్ల రూపురేఖల మార్పు.. కలెక్టర్ కీలక ఆదేశాలు
Karimnagar: కరీంనగర్‌లో సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధిపై కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశాలు. విద్యార్థుల భద్రత, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
Karimnagar
Karimnagar: కరీంనగర్ జిల్లాలో సంక్షేమ వసతి గృహాలను సమగ్రంగా అభివృద్ధి చేసి, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హాస్టళ్ల రూపురేఖలను పూర్తిగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, వార్డెన్లు, డిప్యూటీ వార్డెన్లు, ఇతర సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ కీలక సూచనలు చేశారు.
హాస్టళ్లలో తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బాలికల వసతి గృహాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణను కచ్చితంగా అమలు చేయాలని, అవసరమైన చోట కొత్తగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆర్వో ప్లాంట్లు సక్రమంగా పనిచేయకపోతే వెంటనే మరమ్మతులు చేయాలని తెలిపారు.
విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, హాస్టల్ పరిసరాల్లో దోమల సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. టాయిలెట్స్, వాష్‌రూమ్‌లకు తగిన సదుపాయాలు కల్పించాలని, శానిటేషన్ పనులను నిరంతరం కొనసాగించాలని చెప్పారు.
హాస్టల్ సిబ్బంది రాత్రి వేళల్లో అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని, ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కిచెన్, స్టోర్ రూమ్‌లను పరిశుభ్రంగా ఉంచి, గడువు ముగిసిన సరుకులను వినియోగించవద్దని స్పష్టం చేశారు.
ప్రతి మండలానికి ఒక అధికారి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నామని, హాస్టళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధికి వసతి గృహాలు కీలకమని, వాటిని సమస్యలేమీ లేకుండా తీర్చిదిద్దాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, సోషల్ వెల్ఫేర్ ఇంచార్జ్ డీడీ తిరుపతిరావు, డిపిఓ జగదీశ్వర్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.




