Karimnagar: కరీంనగర్‌లో 'ప్రగతి ప్రణాళిక' సదస్సు

Karimnagar: కరీంనగర్‌లో 'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక' శిక్షణ కార్యక్రమం. ఆదాయ వనరుల పెంపుపై అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే దిశానిర్దేశం.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 10 July 2026 8:28 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో 'ప్రగతి ప్రణాళిక' సదస్సు

కరీంనగర్: కరీంనగర్ గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా సర్పంచులు, కార్యదర్శులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పిలుపునిచ్చారు. గ్రామాలను ఉత్తమ గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు గ్రామాలపై పూర్తి స్థాయి అవగాహనతో పాటు దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని సూచించారు.

కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో 'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక' గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై సర్పంచులు, కార్యదర్శులకు నిర్వహించిన అవగాహన శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ కె. అనిల్ కుమార్‌తో పాటు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామపంచాయతీలు కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులపైనే ఆధారపడకుండా సొంత ఆదాయ వనరులను అభివృద్ధి చేసుకునే దిశగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. గ్రామాల ఆర్థిక స్వావలంబన పెరిగితేనే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న నిధులతో గ్రామాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద కొత్తగా ప్రవేశపెట్టిన వీబీజీ–రామ్ జీ పథకం ద్వారా 318 రకాల అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని సర్పంచులు, కార్యదర్శులు సమర్థంగా వినియోగించుకుని గ్రామాల్లో మౌలిక వసతులు, ప్రజా సౌకర్యాలను మెరుగుపరచాలని సూచించారు.

పంచాయతీరాజ్ చట్టం, గ్రామపంచాయతీల విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని, గ్రామపంచాయతీ ప్రొఫైల్ తయారీ, ఆదాయ వనరుల గుర్తింపు, రానున్న మూడు సంవత్సరాలకు సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నిబద్ధతతో పనిచేస్తే ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు.

పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ కె. అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఎన్ఆర్ఈజీఎస్ కింద అమలు చేస్తున్న వీబీజీ–రామ్ జి పథకం ద్వారా గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టవచ్చన్నారు. నిధులు రావనే అపోహలకు తావివ్వకుండా అందుబాటులో ఉన్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిధులతో పాటు గ్రామాల సొంత ఆదాయాన్ని పెంచుకునే చర్యలు తీసుకోవాలని అన్నారు.

జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ మాట్లాడుతూ, సర్పంచులు, కార్యదర్శులు సమన్వయంతో పనిచేస్తే గ్రామాల అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే అవకాశం ఉందని, సొంత ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్లు గ్రామపంచాయతీ ప్రొఫైల్ తయారీ,

ఆదాయ వనరుల పెంపు, మూడేళ్ల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన, వీబీజీ–రామ్ జీ పథకం కింద చేపట్టే అభివృద్ధి పనులపై సర్పంచులు, కార్యదర్శులకు విస్తృతంగా శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ కే అనిల్ కుమార్, జెడ్పీ సీఈవో పవన్ కుమార్, డీపీఓ జగదీశ్వర్, డీఆర్‌డీఓ గీత, పంచాయతీరాజ్ డీఈ జనార్ధన్, మాస్టర్ ట్రైనర్లు, సర్పంచులు, కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story