Karimnagar: దళిత స్పీకర్‌పై దుర్భాషలు దారుణం: వెలిచాల రాజేందర్‌రావు!

Karimnagar: దళిత స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి, ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్.

CH Gopalakrishna, Regional Coordinator -Karimnagar
Published on: 7 Sept 2026 10:27 PM IST
Karimnagar
X

Karimnagar: దళిత స్పీకర్‌పై దుర్భాషలు దారుణం: వెలిచాల రాజేందర్‌రావు!

కరీంనగర్, సెప్టెంబర్ 7: దళితుడైన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కించపరిచేలా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు, దుర్భాషలాడడం అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

సోమవారం మీడియాతో రాజేందర్ రావు మాట్లాడుతూ.. స్పీకర్‌ను ఏకవచనంతో సంబోధిస్తూ, ‘ఎవడ్రా వాడు’ అంటూ అవమానకరంగా మాట్లాడటం తాతా మధు అహంకారానికి పరాకాష్ట అని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌ను అవమానించడం ఒక వ్యక్తిని కించపరచడం మాత్రమే కాదని, దళిత సమాజాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని రాజేందర్‌రావు అన్నారు. శాసనసభ స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.

దళిత స్పీకర్‌పై కులపరమైన దూషణలకు పాల్పడిన తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వెంటనే కేసు నమోదు చేయాలని రాజేందర్‌రావు డిమాండ్ చేశారు. దీంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాతా మధు ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసే దిశగా శాసనమండలి చైర్మన్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి భాషను మరోసారి ఎవరూ ఉపయోగించకుండా కఠినమైన శిక్షలు విధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.

ప్రజాప్రతినిధులు విధానాలను విమర్శించవచ్చని, ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చని, కానీ రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులను వ్యక్తిగతంగా దూషించడం, అవమానించడం ప్రజాస్వామ్యంలో ఎంతమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు.

ఒక దళిత నేతకు జరిగిన అవమానంగా మాత్రమే ఈ ఘటనను చూడకూడదని.. ఇది ప్రజాస్వామ్యానికి జరిగిన అన్యాయంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలని రాజేందర్‌రావు అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టసభలు, ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాత మధు జీవితకాలం చట్టసభలకు పోటీ చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాజేంద్ర రావు కోరారు.

CH Gopalakrishna, Regional Coordinator -Karimnagar

CH Gopalakrishna, Regional Coordinator -Karimnagar

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, కరీంనగర్ ఉమ్మడి జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న సీనియర్ పాత్రికేయులు మరియు ‘రీజినల్ కోఆర్డినేటర్’.

Next Story