Karimnagar: లక్ష్మీపురం, మల్కాపూర్‌లో విస్తృత కార్డన్ అండ్ సెర్చ్
Karimnagar: కరీంనగర్ రూరల్ ఏసీపీ పర్యవేక్షణలో లక్ష్మీపురం, మల్కాపూర్ గ్రామాల్లో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. అనుమానితుల తనిఖీ.
Karimnagar: లక్ష్మీపురం, మల్కాపూర్‌లో విస్తృత కార్డన్ అండ్ సెర్చ్
కరీంనగర్: కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురం, మల్కాపూర్ గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే ధ్యేయంగా పోలీసులు విస్తృతంగా 'కార్డన్ అండ్ సెర్చ్' (Cordon and Search) తో పాటు 'కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం' (Community Contact Programme) నిర్వహించారు. రూరల్ ఏసీపీ విజయకుమార్ పర్యవేక్షణలో, కొత్తపల్లి పోలీసు స్టేషన్ అధికారి ఇన్‌స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు ఈ తనిఖీలు చేపట్టాయి.
గ్రామాల్లోని ప్రతి వీధిని జల్లెడ పట్టిన పోలీసులు, అనుమానిత వ్యక్తుల వివరాలు ఆరా తీశారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను తనిఖీ చేసి, నిబంధనలు పాటించని వారిపై చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా రూరల్ ఏసీపీ విజయకుమార్ గ్రామస్తులతో మాట్లాడుతూ... ప్రజల భద్రత కోసమే ఈ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. గ్రామాల్లో అపరిచిత లేదా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సైబర్ నేరాలు, మోసపూరిత లింకులు, ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరిస్తూ, కాలనీలు, వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలను అరికట్టవచ్చని సూచించారు.
ఇన్‌స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ మాట్లాడుతూ...
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా పోలీసుల దృష్టికి తీసుకురావచ్చని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ బలగాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి.




