Karimnagar: కరీంనగర్‌లో క్రైమ్ రివ్యూ: పెండింగ్ కేసులను త్వరగా తేల్చాలన్న సీపీ

Karimnagar: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణపై సీపీ గౌష్ ఆలం సమీక్షా సమావేశం నిర్వహించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 21 May 2026 9:55 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో క్రైమ్ రివ్యూ: పెండింగ్ కేసులను త్వరగా తేల్చాలన్న సీపీ

కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించి, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం ఆదేశించారు. కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలులో సీపీ గౌష్ ఆలం అధ్యక్షతన నెలవారీ నేర సమీక్షా సమావేశం సుదీర్ఘంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో అధికారులు తమ పరిధిలోని పెండింగ్ కేసుల డైరీలను (CD Files) సమర్పించి, కేసుల పురోగతిని వివరించారు.

​ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ అధికారులకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

​పెండింగ్ కేసుల సమీక్ష (UI Cases)..

2024 వరకు పెండింగ్‌లో ఉన్న పాత కేసులు, ఈ ఏడాది నమోదైన తీవ్రమైన నేరాల (Grave Crimes) స్థితిగతులను సమీక్షించారు. ఆస్తి సంబంధిత నేరాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, పోక్సో (POCSO) చట్టం కింద నమోదైన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు.

​రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి..

వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.

​విజిబుల్ పోలీసింగ్ & పెట్రోలింగ్..

నగరంలో 'విజిబుల్ పోలీసింగ్' స్పష్టంగా కనిపించాలని, రాత్రి పగలు తేడా లేకుండా పెట్రోలింగ్ మరింత సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. డయల్ 100 ద్వారా వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలన్నారు.

​రౌడీషీటర్లపై నిఘా – ఆకస్మిక తనిఖీలు...

రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని, వారి ఇళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

​హోటళ్లు, లాడ్జీలలో కఠిన నిబంధనలు..

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటళ్లు, లాడ్జీలలో సరైన గుర్తింపు కార్డులు, ఫోన్ నంబర్లు సరిచూసుకున్న తర్వాతే గదులు అద్దెకు ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

​నేపాలీ కార్మికుల వివరాల నమోదు...

ఇటీవల జరిగిన నేపాలీ ముఠాల ఘటనలను దృష్టిలో ఉంచుకుని, కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా వివిధ రంగాలలో పనిచేస్తున్న 1000 మందికి పైగా ఉన్న నేపాలీల వివరాలను పోలీస్ స్టేషన్ల వారీగా రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు.

​బ్యాంకులు, జ్యువలరీ షోరూమ్‌లలో సెక్యూరిటీ ఆడిట్...

బ్యాంకులు, జ్యువలరీ వ్యాపార సంస్థల్లో సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించి, భద్రతా ప్రమాణాలపై తగు సూచనలు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.

​ప్రత్యేక డ్రైవ్‌లు & ప్రజల్లో అవగాహన...

డ్రంక్ అండ్ డ్రైవ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలపై 'నాఖాబందీ' కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ద్వారా గ్రామాలు, వార్డులను సందర్శించి ప్రజలతో మమేకం కావాలని, సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

​మహిళా సిబ్బందికి బ్లూ కోల్ట్స్...

మహిళా పోలీస్ సిబ్బందికి 'బ్లూ కోల్ట్స్' విధులను కేటాయించాలని అధికారులను ఆదేశించారు.

​బక్రీద్ పండుగ వేళ అప్రమత్తత...

రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని పశువుల అక్రమ రవాణా జరగకుండా చూడాలని, ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

​సీసీ కెమెరాల నిఘా...

కమిషనరేట్ వ్యాప్తంగా మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని, ఇదివరకే ఏర్పాటు చేసిన కెమెరాలు నిరంతరం పనిచేసేలా (Working Condition) చూడాలని, వాటి జియో-ట్యాగింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

​ఈ సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, అదనపు డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు శ్రీనివాస్, వేణుగోపాల్, శ్రీనివాస్ జి, విజయకుమార్, వెంకటస్వామి, మాధవి, సతీష్, ప్రతాప్ లతోపాటు కమిషనరేట్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story