Karimnagar: ఖాకీల పహారాలో కేసరి నందనుడి ర్యాలీ.. స్వయంగా రోడ్డుపైకి వచ్చిన సీపీ!
Karimnagar: కరీంనగర్ నగరంలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన భారీ బైక్ ర్యాలీని సీపీ గౌష్ ఆలం స్వయంగా పర్యవేక్షించారు.
Karimnagar: ఖాకీల పహారాలో కేసరి నందనుడి ర్యాలీ.. స్వయంగా రోడ్డుపైకి వచ్చిన సీపీ!
కరీంనగర్: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నగరంలో నిర్వహించిన బైక్ ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ యంత్రాంగం అత్యంత పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది. ఈ భారీ ర్యాలీని నగర పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా సీపీ అధికారులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. ర్యాలీ సాగే మార్గాల్లో ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం నిఘా ఉంచాలని, వివాదాస్పద అంశాలకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ర్యాలీ కారణంగా సామాన్య ప్రజలకు, అంబులెన్స్‌లకు మరియు ఇతర వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని టౌన్ ఏసీపీని ఆదేశించారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే కూడళ్లలో ముందస్తుగా మళ్లింపు చర్యలు చేపట్టాలని సూచించారు.
పండుగ వాతావరణంలో నిర్వహించే ఈ ర్యాలీ ప్రశాంతంగా ముగిసేలా ప్రతి పోలీస్ అధికారి అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు పోలీసుల నుండి పూర్తి సహకారం అందాలని స్పష్టం చేశారు. ర్యాలీ సాగుతున్న తీరును, బందోబస్తు ఏర్పాట్లను సీపీ స్వయంగా పరిశీలించి, సిబ్బందికి తగిన దిశానిర్దేశం చేశారు. పట్టణంలో ఎక్కడా ట్రాఫిక్ స్తంభించకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.




