Karimnagar: అద్వైత యూత్ పార్లమెంట్లో డిప్యూటీ మేయర్
Karimnagar: కరీంనగర్ అద్వైత యూత్ పార్లమెంట్ 2026లో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొని, విద్యార్థులు వార్తాపత్రికలు చదివి చట్టసభలపై అవగాహన పెంచుకోవాలన్నారు.
Karimnagar: అద్వైత యూత్ పార్లమెంట్లో డిప్యూటీ మేయర్
కరీంనగర్: ఉన్నత చదువులు చదివిన యువత క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడే దేశ రాజకీయ వ్యవస్థలో పెను మార్పులు సాధ్యమవుతాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్, ప్రస్తుత నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పిలుపునిచ్చారు. విద్యార్థులు చిన్న వయస్సు నుంచే పార్లమెంటరీ వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలని, నిత్యం వార్తాపత్రికలు చదువుతూ, పార్లమెంట్ మరియు అసెంబ్లీ సమావేశాలను వీక్షిస్తూ సమకాలీన రాజకీయాలపై పట్టు సాధించాలని సూచించారు.
కరీంనగర్‌లోని త్రిధ హోటల్లో అద్వైత ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'అద్వైత యూత్ పార్లమెంట్ 2026' కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వివేకానంద విద్యాసంస్థల చైర్మన్, కార్పొరేటర్ సౌగాని కొమరయ్యతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు, ఎంపీల వేషధారణలో విద్యార్థులు నిర్వహించిన చర్చలు ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ 6 సార్లు కార్పొరేటర్‌గా, మేయర్‌గా, ప్రస్తుతం డిప్యూటీ మేయర్‌గా ప్రజాసేవ చేస్తున్నానని తెలిపారు. పొరుగు దేశాల్లో సైనిక పాలన, నియంతృత్వ పోకడలు, అస్థిర ప్రభుత్వాలు కనిపిస్తుంటే.. 148 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ప్రజాస్వామ్యం బలంగా ఉందని, ఇంతటి గొప్ప దేశంలో పౌరుడిగా పుట్టడం అదృష్టమని పేర్కొన్నారు.
గత 12 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ బలమైన నాయకత్వంలో భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా అరుదైన గౌరవం దక్కుతోందని, 35 దేశాలు ప్రధానికి అత్యున్నత పురస్కారాలు అందించడం దేశానికి దక్కిన గౌరవమని కొనియాడారు. చిన్న వయసులోనే విద్యార్థులకు చట్టసభల పనితీరుపై అవగాహన కల్పిస్తున్న అద్వైత స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.




