Karimnagar: సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పక్కాగా అమలు చేయాలి కలెక్టర్!

Karimnagar: సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 21 July 2026 7:02 PM IST
Karimnagar
X

Karimnagar: సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పక్కాగా అమలు చేయాలి కలెక్టర్!

కరీంనగర్: జాతీయ రహదారుల పై ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించేందుకు రవాణా, పోలీస్, నేషనల్ హైవే అధికారులు సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

జాతీయ రహదారులపై రోడ్డు భద్రత ప్రమాదాల నివారణ, సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలు తదితర అంశాలపై ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

పోలీసు, రవాణా, ఎన్.హెచ్.ఎ.ఐ అధికారులు సమన్వయంతో రహదారుల భద్రత, ప్రమాదాల నివారణకు తగిన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. "జిల్లా రహదారి భద్రతా టాస్క్ ఫోర్స్" ఆధ్వర్యంలో జిల్లా రోడ్డు భద్రతకు సంబంధించి చేపట్టిన చర్యలపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం "రైట్ ఆఫ్ వే" మార్గం వెంబడి కొత్తగా ఎలాంటి వాణిజ్య నిర్మాణాలు అనుమతించరాదని, మునిసిపల్, ట్రేడ్ లైసెన్స్ వంటివి "రైట్ ఆఫ్ వే" వెలుపల ఏర్పాటు చేయకుండా చూడాలని, ఎలాంటి కొత్త అనుమతులూ ఇవ్వరాదని పేర్కొన్నారు.

జాతీయ రహదారుల వెంట ఆక్రమణలు పరిశీలించేందుకు, రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు డ్రోన్ ద్వారా నిఘా ఉంచాలని తెలిపారు. రోడ్డు భద్రత చర్యలకు అవసరమైన నిధులు కేటాయిస్తామని అన్నారు. జాతీయ రహదారుల వెంట గట్టి నిఘా, పెట్రోలింగ్, అక్రమ పార్కింగ్ వంటి అంశాలను పర్యవేక్షించాలని పోలీస్, రవాణా, నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి పెట్రోలింగ్ కోసం పోలీస్ రవాణా శాఖ సిబ్బందితో కూడిన ప్రత్యేక హైవే నిఘా బృందాలను ఏర్పాటు చేయాలని అన్నారు.

స్పీడ్ డిటెక్టర్లు, కెమెరాలు, సైన్ బోర్డులు, ఎమర్జెన్సీ కాల్ బాక్సులు వంటివి పరిశీలించాలని తెలిపారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్ గుర్తించి ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు. బ్లాక్ స్పాట్ వద్ద హైమాస్డ్ లైటింగ్, స్పీడ్ ఎన్ ఫోర్స్ మెంట్ కెమెరాలు, మెట్రో రిప్లేక్టివ్ హెచ్చరిక సంకేతాలు వంటివి ఏర్పాటు చేయాలని అన్నారు.

భారీ వాహన డ్రైవర్లకు విశ్రాంతి సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ వైద్య సహాయం కోసం సమీప ఆసుపత్రులను మ్యాపింగ్ చేయాలని తెలిపారు. ఈ సౌకర్యాలను పరిశీలించాలని, లేని చోట్ల అవసరమైన చర్యలు తీసుకుని నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని పేర్కొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story