Karimnagar: మున్సిపల్ చరిత్రలో తొలిసారిగా కార్యాలయంలో వినాయక ఉత్సవాలు
Karimnagar: కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో తొలిసారిగా గణపతి నవరాత్రి ఉత్సవాలు. మేయర్ కొలగాని శ్రీనివాస్, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ దంపతుల ప్రత్యేక పూజలు.
Karimnagar: మున్సిపల్ చరిత్రలో తొలిసారిగా కార్యాలయంలో వినాయక ఉత్సవాలు
కరీంనగర్: నగరపాలక సంస్థ చరిత్రలో తొలిసారిగా నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఉత్సవాల తొలిరోజు శ్రీ వినాయకుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు , మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ దంపతులు పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో కరీంనగర్ నగరం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. నగర ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, ఐశ్వర్యం కలగాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
నగరపాలక సంస్థ కార్యాలయంలో తొలిసారిగా గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని మేయర్ పేర్కొన్నారు. తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహిస్తూ, నగర ప్రజల సంక్షేమం, కరీంనగర్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నగర ప్రజలందరూ గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మేయర్ కోరారు.
అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ.. వినాయక చవితి ఉత్సవాల్లో పర్యావరణహిత పద్ధతులను పాటించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఉత్సవాలను నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్‌రావు, తోట అనిల్, మాసం గణేష్, ఏపీపీ చంద్ర, ఎన్నం ప్రకాష్, కో-ఆప్షన్ సభ్యుడు నందకుమార్, నగరపాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




