Karimnagar: షాకింగ్: బస్టాండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో పురుగులు పట్టిన గుడ్లు.. కింగ్స్ ఫాస్ట్ ఫుడ్ సీజ్!
Karimnagar: కరీంనగర్ బస్టాండ్‌లో ఆహార భద్రతా శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. కుళ్లిపోయిన గుడ్లు, పురుగులు ఉన్న ఆహారాన్ని గుర్తించి కింగ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ను సీజ్ చేశారు.
Karimnagar: షాకింగ్: బస్టాండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో పురుగులు పట్టిన గుడ్లు.. కింగ్స్ ఫాస్ట్ ఫుడ్ సీజ్!
కరీంనగర్: కరీంనగర్ ఆహార భద్రత శాఖ ఆధ్వర్యంలో బస్ స్టాండ్ కాంప్లెక్స్‌లో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మరియు బేకరీలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడింది. ఈ ప్రత్యేక డ్రైవ్‌ను “ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్” మొబైల్ ల్యాబొరేటరీ సహాయంతో నిర్వహించారు. మొబైల్ ల్యాబ్ ద్వారా ఆహార నాణ్యత ప్రమాణాలను పరీక్షించారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల సిబ్బందికి అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించారు.
తనిఖీల సందర్భంగా క్రింది అంశాలు బయటపడ్డాయి. కొన్ని దుకాణాలు చెల్లుబాటు అయ్యే ఫుడ్ లైసెన్స్ కలిగి లేకపోవడంతో వారికి నోటీసులు జారీ చేశారు.
ప్రత్యేక డ్రైవ్ సమయంలో వినియోగిస్తున్న టీ పొడి నాణ్యతను పరీక్షించగా, వాడుతున్న నూనె నాణ్యతను కూడా పరీక్షించడం జరిగింది.ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మంచూరియా వంటి ఆహార పదార్థాల తయారీలో ఫుడ్ కలర్స్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించబడింది. అటువంటి ఫుడ్ కలర్స్‌ను స్వాధీనం చేసుకొని, వాటితో తయారు చేసిన ఆహార పదార్థాలను కూడా పారవేయడం జరిగింది.
ఎస్‌ఎఫ్‌ఎస్ బేకరీలో గడువు ముగిసిన బిస్కెట్ ప్యాకెట్లు సుమారు రూ.1000/- విలువైనవి స్వాధీనం చేసుకొని పారవేయడం జరిగింది. అలాగే జ్యూస్ తయారీలో ఉపయోగిస్తున్న దెబ్బతిన్న ద్రాక్ష పండ్లను కూడా పారవేయడం జరిగింది.బస్ స్టాండ్ కాంప్లెక్స్‌లోని కింగ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీలో కుళ్లిపోయిన మరియు దెబ్బతిన్న గుడ్లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించబడింది. కొన్ని గుడ్లలో పురుగులు కూడా ఉన్నట్లు గుర్తించారు. అటువంటి గుడ్లను పారవేసి, నిబంధనల ప్రకారం కింగ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌పై చర్యలు ప్రారంభించి, ఆ సెంటర్‌ను మూసివేయడం జరిగింది. అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు ఆహార పదార్థాల తయారీలో ఎటువంటి ఫుడ్ కలర్స్ ఉపయోగించరాదని, అలాగే కుళ్లి పోయిన గుడ్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలు ఎవరైనా ఇలాంటివి గుర్తించినప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో నిర్వహించేవారు, బేకరీలు వంటి షాపుల్లో వినియోగించే వాటిలో నాణ్యత లేకుంటే కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని కేసులు నమోదు చేసి శిక్షించబడుతుందని తెలిపారు.




