Karimnagar: కరీంనగర్: మడలేశ్వరాలయం గోడపై ఫ్లెక్సీ రగడ.. కమిషనర్‌కు వినతి

Karimnagar: కరీంనగర్ మడలేశ్వర స్వామి ఆలయ గోడపై చెప్పుల దండతో కూడిన మున్సిపల్ హెచ్చరిక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 21 Sept 2026 7:58 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్: మడలేశ్వరాలయం గోడపై ఫ్లెక్సీ రగడ.. కమిషనర్‌కు వినతి

కరీంనగర్: కరీంనగర్ 43 వ డివిజన్ గోదాంగడ్డ ప్రాంతంలో చెత్త వేయకుండా ప్రజలకు హెచ్చరికగా మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి పాత చెప్పులు, చీపుర్లు వేలాడదీయడం పట్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యేకంగా, ఈ ఫ్లెక్సీని రజకుల ఆరాధ్య దైవమైన శ్రీ మడలేశ్వర స్వామి దేవాలయం ప్రహరీ గోడపై ఏర్పాటు చేయడంతో పాటు, దానికి పాత చెప్పులు మరియు చీపుర్లు కట్టడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని స్థానికులు పేర్కొన్నారు. దేవాలయ పరిసర ప్రాంతంలో ఇటువంటి చర్యలు చేపట్టడం వల్ల భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు.

పరిశుభ్రతపై అవగాహన కల్పించడం మున్సిపల్ అధికారుల బాధ్యత అయినప్పటికీ, ప్రజలను అవమానించే విధంగా లేదా మతపరమైన, సామాజిక భావోద్వేగాలను దెబ్బతీసే రీతిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం సమంజసం కాదని వారు అభిప్రాయపడ్డారు.

ఈ విషయంపై రుద్రాక్ష చంద్రశేఖర్, ములుగు ప్రకాష్, పున్న అనీల్, ప్రశాంత్, మహేష్, సందీప్ తదితరుల ఆధ్వర్యంలో పలువురు స్థానికులు కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. వెంటనే సంబంధిత ఫ్లెక్సీని తొలగించాలని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

అలాగే, భవిష్యత్తులో ప్రజల మనోభావాలు, మత విశ్వాసాలు మరియు దేవాలయాల పవిత్రతకు భంగం కలగకుండా మున్సిపల్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పరిశుభ్రత కార్యక్రమాలను ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా నిర్వహించాలే గానీ, ఏ వర్గానికైనా లేదా మతపరమైన భావోద్వేగాలకు భంగం కలిగించే విధంగా చేపట్టరాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN