Karimnagar: దీక్షా దివస్ సభను చారిత్రాత్మకంగా నిర్వహించాలి

Karimnagar: నవంబర్ 29న కరీంనగర్‌లో జరిగే దీక్షా దివస్ సభకు భారీగా జన సమీకరణ చేయాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ శ్రేణులకు పిలుపు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 23 Nov 2026 11:05 PM IST
Karimnagar
X

Karimnagar: దీక్షా దివస్ సభను చారిత్రాత్మకంగా నిర్వహించాలి

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టమని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. నవంబర్ 29న నిర్వహించనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన సోమవారం కరీంనగర్ జిల్లా గాంధీనగర్ చింతకుంటలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దీక్ష దివస్ సభ కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దీక్షా దివస్ సభ ఏర్పాట్లు, కరీంనగర్ నియోజకవర్గం నుంచి భారీగా జన సమీకరణ, పార్టీ శ్రేణుల భాగస్వామ్యంపై నాయకులకు ఇరువురు నేతలు దిశానిర్దేశం చేశారు.

ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం

ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ పార్టీలో చిన్నా పెద్దా అనే తేడా లేదని, ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం, ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. శరీరంలో ప్రతి అవయవం ఎంత ముఖ్యమో పార్టీలో ప్రతి నాయకుడు, కార్యకర్త కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ఏ ఒక్క చిన్న అవయవం పనిచేయకపోయినా శరీర వ్యవస్థ మొత్తం దెబ్బతింటుందని, అదే విధంగా పార్టీలో ఏ ఒక్క కార్యకర్తను నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని వివరించారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తన కుటుంబ సభ్యులేనని, పార్టీ బాధ్యతలను కుటుంబ బాధ్యతగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

కరీంనగర్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని, భవిష్యత్తులోనూ ఇదే ఐక్యతతో ముందుకు సాగాలని కోరారు.

కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ ఉద్యమానికి మలుపు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటాన్ని గంగుల కమలాకర్ గుర్తుచేశారు. దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసినప్పటికీ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమైందన్నారు. 2009 నవంబర్ 29న కరీంనగర్ గడ్డపై కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిందని పేర్కొన్నారు. ఆ దీక్షతో తెలంగాణవ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. కేసీఆర్ దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు.

కరీంనగర్ అభివృద్ధికి కేసీఆర్ ప్రత్యేక ప్రాధాన్యత

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కరీంనగర్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని గంగుల కమలాకర్ అన్నారు. గతంలో నిధుల కొరతతో అభివృద్ధికి నోచుకోని నగరానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. నగర రూపురేఖలు మారేలా పలు పనులు చేపట్టి కరీంనగర్‌ను అభివృద్ధి పథంలో నడిపించారని పేర్కొన్నారు.

తెలంగాణ అభివృద్ధిలో దేశానికే ఆదర్శం

కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుందని అన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం సుమారు రూ.4.20 లక్షలకు చేరుకోవడం రాష్ట్ర ప్రగతికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడే ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల పరిస్థితిని పరిశీలించాలని సూచించారు.

తెలంగాణ ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రాష్ట్రానికి వచ్చి అభివృద్ధి నేర్చుకోవాలంటే ఉత్తరప్రదేశ్‌ను చూడాలని చెప్పారని గుర్తుచేశారు. అయితే ఉత్తరప్రదేశ్ తలసరి ఆదాయం తెలంగాణతో పోలిస్తే చాలా తక్కువగా ఉందన్నారు. మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోనూ తలసరి ఆదాయం ఆశించిన స్థాయిలో లేదని, గుజరాత్‌లో సైతం తెలంగాణ కంటే తక్కువగా ఉందని విమర్శించారు. దీర్ఘకాలంగా అధికారంలో ఉన్నప్పటికీ ఆయా రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని అన్నారు.

ప్రజా సమస్యలపై బీజేపీ నేతలు స్పందించాలి

కరీంనగర్ అభివృద్ధి గురించి మాట్లాడే బీజేపీ నాయకులు ముందుగా ప్రజలకు సంబంధించిన సమస్యలపై దృష్టి సారించాలని సంజయ్ సూచించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం వంటి పనులను సైతం సకాలంలో పూర్తి చేయలేని పరిస్థితిపై ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ విమర్శలు, పాదయాత్రలతో కాలం గడపడం సరికాదన్నారు.

రైతులకు సాగునీరు, విద్యుత్ సమస్యలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, విద్యార్థుల భవిష్యత్తు వంటి అంశాలపై బీజేపీ నాయకులు పోరాటం చేయాలని సూచించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు కల్పించిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, హక్కులు, ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు.

సోషల్ మీడియాలో యువత చురుగ్గా ఉండాలి

పార్టీ శ్రేణులు, యువత సోషల్ మీడియాలో మరింత చురుగ్గా వ్యవహరించాలని డాక్టర్ సంజయ్ పిలుపునిచ్చారు. ప్రత్యర్థి పార్టీలు సామాజిక మాధ్యమాల ద్వారా చేస్తున్న ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. యువతను పార్టీకి మరింత చేరువ చేయడంతో పాటు వారి సమస్యలను తెలుసుకొని అండగా నిలవాలని అన్నారు.

నవంబర్ 29న నిర్వహించనున్న దీక్షా దివస్ సభకు కరీంనగర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి డివిజన్ నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా సమన్వయంతో పనిచేయాలని గంగుల కమలాకర్, డాక్టర్ సంజయ్ పిలుపునిచ్చారు. కేసీఆర్ చేసిన పోరాటాన్ని, తెలంగాణ సాధన కోసం చేసిన త్యాగాలను భావితరాలకు తెలియజేసేలా దీక్షా దివస్ సభను ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల బాధ్యులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR