Karimnagar: భార్య ఆత్మహత్యకు కారణమైన భర్త అరెస్ట్

Karimnagar: కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్లలో అక్రమ సంబంధం కోసం భార్య శ్రావంతిని వేధించి ఆత్మహత్యకు కారణమైన భర్త కొత్తూరి సంపత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 19 Nov 2026 11:32 PM IST
Karimnagar
X

Karimnagar: భార్య ఆత్మహత్యకు కారణమైన భర్త అరెస్ట్

కరీంనగర్: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ సంబంధం కోసం భార్యను వేధించి ఆత్మహత్యకు కారణమైన భర్త అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 9వ తేదీన కరీంనగర్ రూరల్ మండలంలోని ఇరుకుల్ల గ్రామంలో వివాహిత శ్రావంతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో ఆమె భర్త కొత్తూరి సంపత్‌ ను కరీంనగర్ రూరల్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

వరంగల్ జిల్లాకు చెందిన ఇమ్మడి ముత్తయ్య తన కుమార్తె శ్రావంతిని సుమారు 11 సంవత్సరాల క్రితం కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్లా గ్రామానికి చెందిన కొత్తూరి సంపత్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

అయితే, గత కొంతకాలంగా కొత్తూరి సంపత్ తన భార్య శ్రావంతిని వివిధ విషయాలలో వేధిస్తుండేవాడు. అంతేకాకుండా, గత రెండు సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలానికి చెందిన ఒక మహిళతో పరిచయం ఏర్పరచుకొని అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. సదరు మహిళ తనను వివాహం చేసుకోవాలంటే భార్యను వదిలించుకోవాలని సంపత్‌పై ఒత్తిడి చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఈ క్రమంలో సంపత్ తన భార్యను వదిలించుకోవాలనే ఉద్దేశంతో ఆమెను తరచూ వేధించేవాడు. ఈ నెల 9వ తేదీ రాత్రి సంపత్ తన మొబైల్ ఫోన్‌లో సదరు మహిళతో వీడియో కాల్స్, చాటింగ్స్ చేస్తుండగా శ్రావంతి వాటిని గమనించి భర్తను నిలదీసింది. దీంతో సంపత్ తాను మరో మహిళను ప్రేమిస్తున్నానని, ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పడంతో పాటు, నువ్వు బతికితే బతుకు, చస్తే చావు అని దురుసుగా మాట్లాడినట్లు విచారణలో వెల్లడైంది.

భర్త ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రావంతి, తన భవిష్యత్తుతో పాటు ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు ఏమవుతుందోనని ఆవేదనకు గురై మరుసటి రోజు ఉదయం ఇంట్లోని పిల్లల బెడ్‌రూమ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

ఉదయం సుమారు 8 గంటల సమయంలో నిద్రలేచిన సంపత్, శ్రావంతి ఉరివేసుకొని ఉండటాన్ని గమనించినప్పటికీ, తనపై అనుమానం రాకుండా ఉండేందుకు తన ఫోన్‌లోని చాటింగ్స్, మెసేజ్‌లను తొలగించి, బంధువులు, తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారికి సమాచారం అందించి ఏమీ తెలియనట్లు నటించినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. అనంతరం ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఇమ్మడి ముత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు కొత్తూరి సంపత్‌పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు.

ఈ క్రమంలో ఈరోజు బొమ్మకల్ ఫ్లైఓవర్ సమీపంలోని జైలు బంక్ వద్ద సంపత్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో, వెంటనే సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా సిరికొండకు చెందిన మహిళతో జరిపిన చాటింగ్స్, మెసేజ్‌లు, వీడియో కాల్స్‌కు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా సదరు మహిళతో అతనికి అక్రమ సంబంధం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు.

నిందితుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌తో పాటు, సదరు మహిళను కలుసుకోవడానికి ఉపయోగిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి, నిందితుడిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్‌కు తరలించడం జరిగిందన్నారు .కరీంనగర్ రూరల్ పోలీసులు ఈ కేసులో సేకరించిన ఆధారాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నాట్లు తెలిపారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR