Karimnagar: కరీంనగర్ ఐటీ టవర్ వద్ద డీవైఎఫ్‌ఐ నిరసన

Karimnagar: ఖాళీగా ఉన్న టవర్‌లో కొత్త కంపెనీలు ఏర్పాటు చేయాలి.. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెంటనే స్పందించాలని నరేష్ పటేల్ డిమాండ్.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 3 Jun 2026 12:59 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ ఐటీ టవర్ వద్ద డీవైఎఫ్‌ఐ నిరసన

కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని ఐటీ టవర్‌ను స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించే కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరుతూ డీవైఎఫ్‌ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఐటీ టవర్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ మాట్లాడుతూ, కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కరీంనగర్ ఐటీ టవర్ ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వాలు హామీలు ఇచ్చాయని, కానీ నేటికీ ఆ హామీలు అమలు కాలేదని విమర్శించారు.

కరీంనగర్ జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాలకు చెందిన వేలాది మంది యువత ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, ఇతర వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసినప్పటికీ ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించాల్సిన ఐటీ టవర్ నేడు ఆశించిన స్థాయిలో కంపెనీలు లేక నిరుపయోగంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఐటీ టవర్‌లో కార్యకలాపాలు నిర్వహించిన పలు సంస్థలు వెళ్లిపోవడం, ఖాళీగా ఉన్న కార్యాలయ స్థలాల్లో కొత్త కంపెనీలను తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమవడం వల్ల స్థానిక యువత ఉద్యోగ అవకాశాలను కోల్పోయిందన్నారు. యువత హైదరాబాద్, బెంగళూరు, పుణే, చెన్నై వంటి నగరాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ అభివృద్ధి విధానాన్ని మార్చి జిల్లా కేంద్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కరీంనగర్ ఐటీ టవర్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకురావడంతో పాటు స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు.

యువత ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా అవకాశాలు లేక నిరాశకు గురవుతున్నారని, నిరుద్యోగం కారణంగా అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కరీంనగర్ ఐటీ టవర్‌లో వెంటనే కొత్త కంపెనీలను ఏర్పాటు చేయాలని, ఖాళీగా ఉన్న కార్యాలయ స్థలాలను వినియోగంలోకి తీసుకురావాలని, స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలని, ఐటీ మరియు ఇతర రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.జిల్లాలో నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక ఉపాధి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని

ప్రభుత్వం ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు వెంటనే స్పందించి కరీంనగర్ ఐటీ టవర్‌ను ఉద్యోగాల కేంద్రంగా మార్చి స్థానిక యువతకు న్యాయం చేయాలని ఆయన కోరారు.లేనిపక్షంలో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు శివ కుమార్ జిల్లా నాయకులు అజేయ్,సాయి,నరేందర్,రాహుల్,దినేష్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story