Karimnagar: కరీంనగర్‌లో మేయర్ కొలగాని శ్రీనివాస్ స్వాతంత్ర వేడుకలు

Karimnagar: కరీంనగర్ మేయర్‌గా తొలిసారి స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న కొలగాని శ్రీనివాస్. నగరపాలక సంస్థ కార్యాలయంలో జాతీయ పతాకం ఆవిష్కరణ.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 15 Aug 2026 8:26 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో మేయర్ కొలగాని శ్రీనివాస్ స్వాతంత్ర వేడుకలు

కరీంనగర్: కరీంనగర్ నగర మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా నగర ప్రథమ పౌరుడి హోదాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు. శనివారం ఉదయం మేయర్ క్యాంపు కార్యాలయం మరియు కరీంనగర్ నగరపాలక సంస్థ (MCK) ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన, అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన అధికారిక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

ఉదయం 7 గంటలకు మేయర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మేయర్ కొలగాని శ్రీనివాస్, జాతీయ గీతాలాపన అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకొని వారి త్యాగాలకు ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఉదయం 8:30 గంటలకు కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నగర ప్రథమ పౌరుడిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో కలిసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ, “కరీంనగర్ నగర మేయర్‌గా తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం నాకు ఎంతో గర్వకారణం. స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కరీంనగర్ నగర సమగ్ర అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తాం” అని తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్యం సాధించి 100 సంవత్సరాలు పూర్తయ్యే 2047 నాటికి భారతదేశాన్ని ‘వికసిత భారత్’గా తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పంలో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

“వికసిత భారత్ @2047 లక్ష్యం కేవలం ప్రభుత్వాల లక్ష్యం మాత్రమే కాదు; ప్రతి పౌరుడి సంకల్పం కావాలి. దేశ అభివృద్ధిలో నగరాలు కీలక పాత్ర పోషిస్తాయి. పరిశుభ్రత, మౌలిక వసతులు, ఆధునిక పట్టణాభివృద్ధి, ప్రజా సంక్షేమ రంగాల్లో కరీంనగర్‌ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం” అని మేయర్ స్పష్టం చేశారు.

దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, యువత దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుంచుకుంటూ దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.

మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని నగర ప్రథమ పౌరుడి హోదాలో జరుపుకోవడం తనకు ప్రత్యేకమైన, చిరస్మరణీయమైన సందర్భంగా భావిస్తున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ , డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు , కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story