Karimnagar: జూలై 31 వరకు కరీంనగర్‌లో స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ మేయర్!
Karimnagar: వర్షాకాలంలో సీజనల్, అంటువ్యాధులను నివారించడమే లక్ష్యంగా కరీంనగర్‌లో "సఫాయి అప్నావో – బీమారీ భగావో" కార్యక్రమాన్ని మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు.
Karimnagar: జూలై 31 వరకు కరీంనగర్‌లో స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ మేయర్!
కరీంనగర్: వర్షాకాలంలో సీజనల్, అంటువ్యాధులను నివారించడమే లక్ష్యంగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "సఫాయి అప్నావో – బీమారీ భగావో" ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, పారిశుధ్య పర్యావరణ శాఖ అధికారులతో కలిసి కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 31 వరకు నగరవ్యాప్తంగా ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌ను విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ, నగరంలో రోజువారీ పారిశుధ్య పనులను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రత్యేక సానిటేషన్ డ్రైవ్‌ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. నగర ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, సంక్షేమ సంఘాల భాగస్వామ్యంతో జీ.వి.పి. పాయింట్లు, మార్కెట్లు, బస్టాండ్, రైల్వే స్టేషన్‌లు, ఇతర ప్రజా ప్రదేశాల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి తొలగించడం, చెత్తాచెదారం పూర్తిగా తొలగించడం, డ్రైనేజీల్లో పేరుకుపోయిన సిల్ట్‌ను శుభ్రం చేయడం, దోమల నివారణ కోసం యాంటీ లార్వా ఆపరేషన్లు, ఫాగింగ్, స్ప్రేయింగ్ వంటి చర్యలను విస్తృతంగా చేపడతామని తెలిపారు.
కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ –
ఎడ్యుకేషన్ – కమ్యూనికేషన్ (IEC) కార్యక్రమాల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, వెల్ఫేర్ గ్రూపులు, హోటల్, రెస్టారెంట్, మార్కెట్ అసోసియేషన్‌లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి నగర పరిశుభ్రత, సోర్స్ లెవల్ సెగ్రిగేషన్, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.
నగరంలోని డ్రైనేజీలు, పెద్ద నాళాలు, కాలువలు, ఓపెన్ ప్లాట్లను పూర్తిగా శుభ్రపరచి వర్షపు నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెరువులు, కుంటల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు.
పారిశుధ్య కార్మికులకు వ్యర్థాల వేరు చేయడం, డోర్ టు డోర్ చెత్త సేకరణ, సెగ్రిగేషన్, పీపీఈ కిట్ల వినియోగంపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ముఖ్యంగా స్లమ్ ప్రాంతాల్లో 100 శాతం డోర్ టు డోర్ చెత్త సేకరణ, మెరుగైన పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.
పబ్లిక్, కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్వహణను మెరుగుపరచడంతో పాటు వాటి మరమ్మతులు చేపట్టి పరిశుభ్రంగా ఉంచుతామని, వాటి వినియోగంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
నగరంలోని పార్కులు, హెరిటేజ్ ప్రాంతాలు, స్ట్రీట్ ఫుడ్ జోన్‌లు, మార్కెట్ ప్రాంతాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
"నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్దడంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఎంతో కీలకం. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వర్షాకాలంలో వ్యాపించే సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. జూలై 31 వరకు నిర్వహించే ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌లో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలి. కరీంనగర్‌ను క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి" అని మేయర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అదనపు కమిషనర్లు ఆయాజ్, సువార్త అసిస్టెంట్ కమిషనర్ రాజమనోహర్, డీఈ ,లచ్చిరెడ్డి, వెటర్నరీ అధికారి దుర్గాప్రసాద్ రెడ్డి, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్లు స్వామి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.




