Karimnagar: వర్షాకాలం ముందస్తు చర్యలు: కరీంనగర్ లోతట్టు ప్రాంతాల్లో మేయర్ శ్రీనివాస్ పర్యటన!

Karimnagar: రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ నగరపాలక సంస్థ (MCK) యంత్రాంగం అప్రమత్తమైంది.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 29 Jun 2026 6:58 AM IST
Karimnagar
X

Karimnagar: వర్షాకాలం ముందస్తు చర్యలు: కరీంనగర్ లోతట్టు ప్రాంతాల్లో మేయర్ శ్రీనివాస్ పర్యటన!

కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 53వ డివిజన్‌లో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంతాలను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ శ్వేత రమన్, మున్సిపల్ అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అవసరమైన ముందస్తు చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

పర్యటన సందర్భంగా మంచిర్యాల చౌరస్తా నుంచి శర్మనగర్ వరకు ఉన్న లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు, మురుగు నీరు ఇళ్లలోకి చేరుతున్న సమస్యను స్థానికులు మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను పరిశీలించిన మేయర్ సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు నగరంలోని అన్ని డివిజన్లలో మురుగు కాలువల పూడికతీత (సిల్ట్ తొలగింపు) పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇటీవల 51వ డివిజన్‌లో కూడా ఇదే తరహా పనులను పరిశీలించినట్లు పేర్కొన్నారు.

రోడ్లపైకి, ఇళ్లలోకి వర్షపు నీరు చేరే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద సుమారు రూ.25 కోట్ల వ్యయంతో డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధం చేసి, త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నగర ప్రజలకు పలు సూచనలు చేశారు. మురుగు కాలువల్లో ప్లాస్టిక్, చెత్త వేయవద్దని, పూడికతీత పనుల సమయంలో మట్టికన్నా ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడుతున్నాయని తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్లాస్టిక్ రహిత కరీంనగర్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఇంటింటి చెత్తను మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆటోలకు మాత్రమే అందించాలని, ఆటోలు రాని ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్లు లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

రానున్న వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మేయర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story