Karimnagar: పీజీ సీటు రాకపోవడంతో మనోవేదనతో ఎంబీబీఎస్ డాక్టర్ ఆత్మహత్య
Karimnagar: కరీంనగర్‌లో పీజీ సీటు రాక తీవ్ర మనోవేదనతో ఎంబీబీఎస్ డాక్టర్ గౌతమ్ ఆత్మహత్య. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కరీంనగర్ రూరల్ పోలీసులు.
Karimnagar: పీజీ సీటు రాకపోవడంతో మనోవేదనతో ఎంబీబీఎస్ డాక్టర్ ఆత్మహత్య
కరీంనగర్: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పీజీ సీటు రాలేదనే మనోవేదనతో ఓ MBBS డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, పసుల గౌతమ్ (39) MBBS కోర్సు పూర్తి చేసి గత నాలుగు సంవత్సరాలుగా కాంట్రాక్ట్ బేసిస్‌పై ధర్మారం మండలంలోని నందిమేడారం మరియు చొప్పదండి మండలంలోని కటికనపల్లి గ్రామాల్లోని PHC ల్లో వైద్యుడిగా విధులు నిర్వహించాడు.
సుమారు నెల రోజుల క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. గౌతమ్ గతంలో రెండు సార్లు పీజీ ప్రవేశ పరీక్ష రాసినప్పటికీ, మెరిట్ మార్కులు రాకపోవడంతో పీజీ సీటు లభించలేదు. దీంతో కొంతకాలంగా తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిన్న రాత్రి గౌతమ్ తన తల్లిదండ్రులు సులోచన మొగులయ్య లతో మాట్లాడి బాధపడుతూ తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లి నిద్రించాడు.
అనంతరం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో తల్లి లేచి చూడగా గౌతమ్ బెడ్‌రూమ్‌లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. తల్లిదండ్రులు వెంటనే చుట్టుపక్కల వారిని పిలిచి అతడిని కిందకు దించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
గౌతమ్ తండ్రి పసుల రాజమొగిలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన కుమారుడి మరణంపై ఎవరిపైనా ఎలాంటి అనుమానం లేదని తండ్రి మొగిలయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మృతుడు గౌతమ్ తండ్రి ఇరిగేషన్ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందారు. గౌతమ్ అన్న బ్యాంక్ మేనేజర్‌గా, చెల్లెలు జగిత్యాలలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబం న్యూ సరస్వతి నగర్, తిగలగుట్టపల్లి ప్రాంతంలో నివసిస్తోంది. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నిరంజన్ రెడ్డి తెలిపారు.




