Karimnagar: పది రోజుల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తాం.. కలెక్టర్ చిత్రా మిశ్రా

Karimnagar: కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు 75 శాతం ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 25 May 2026 8:24 AM IST
Karimnagar
X

Karimnagar: పది రోజుల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తాం.. కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్ : ఇప్పటివరకు జిల్లాలో సుమారు 75 శాతం ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి అయిందనీ, మిగిలిన కొనుగోళ్లను కూడా వచ్చే 10 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు.

ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు.

పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష, అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నేపథ్యంలో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం, కొనుగోలు సంస్థలు, రైస్ మిల్లర్లు, రవాణా విభాగాలు సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 68 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి అయినట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 2,29,514 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఈ కొనుగోళ్ల విలువ రూ.544.74 కోట్లు కాగా, రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.407.21 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. మిగతా అమౌంటు ఒకటి రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమవుతాయని చెప్పారు. రైతులకు వెంట వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గత నాలుగు రోజుల్లోనే 44 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలిస్తూ, లోడింగ్–అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. అవసరమైన టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమైతే అదనపు కేటాయింపులు కూడా చేపడుతున్నామని తెలిపారు.

మరో 10 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రోజువారీ లక్ష్యాల వారీగా మిగిలిన ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామన్నారు. ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించడం, లారీలు.. ఇతర రవాణా వాహనాలను సమృద్ధిగా అందుబాటులో ఉంచడం, రైతులకు తాగునీరు, నీడ తదితర మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వివరించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మిగిలిన ప్రక్రియను మరో 10 రోజుల్లో విజయ వంతంగా పూర్తి చేయడమే జిల్లా యంత్రాంగం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. 24 గంటల పాటు అధికారులు అందుబాటులో ఉంటూ ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నామని జిల్లా యంత్రాంగం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహిస్తున్నదని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story