Karimnagar: కరీంనగర్‌లో కర్మకాండ నిలయాల నిర్మాణానికి చర్యలు
Karimnagar: కరీంనగర్‌లో అంత్యక్రియల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు కర్మకాండ నిలయాలు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు.
Karimnagar
Karimnagar: నగరంలో కిరాయి ఇళ్లలో నివసించే పేద కుటుంబాలు అంత్యక్రియల సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కరీంనగర్‌లో ప్రత్యేకంగా “కర్మకాండ నిలయాలు” నిర్మించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ విషయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచనల మేరకు నగర పాలకవర్గం కార్యాచరణ చేపట్టింది.
అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కిరాయి ఇళ్ల యజమానులు అనుమతించకపోవడంతో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కొందరు లాడ్జీల్లో ఉండలేకపోతే, మరికొందరు స్మశానవాటికల్లోనే తలదాచుకునే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించారు.
కేంద్ర మంత్రి సూచనల మేరకు కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు నగరంలోని స్మశానవాటికలను పరిశీలించారు. మార్కండేయ నగర్, ఓల్డ్ సిటీ కేబుల్ బ్రిడ్జి సమీపం, అల్కాపురి, రేకుర్తి, మంచిర్యాల రహదారి ప్రాంతాల్లో అనువైన స్థలాలను గుర్తించారు.
స్థలాల ఎంపిక పూర్తైన అనంతరం నగర నాలుగు దిక్కుల్లో జీ+1 నమూనాలో నాలుగు కర్మకాండ నిలయాలను నిర్మించాలని నిర్ణయించారు. ఒక్కో నిలయానికి సుమారు రూ.50 లక్షల వ్యయం చేయాలని అంచనా వేశారు. ఈ నిలయాల్లో విద్యుత్, తాగునీరు, బస సదుపాయం వంటి మౌలిక వసతులను కల్పించనున్నారు.
ఈ కర్మకాండ నిలయాలు అందుబాటులోకి వస్తే, కుటుంబ సభ్యులు మరణించిన తర్వాత కర్మకాండలు పూర్తయ్యే వరకు గరిష్టంగా 13 రోజులపాటు అక్కడే ఉండే సౌకర్యం కల్పించనున్నారు. పూర్తిగా ఉచితం కాకుండా, కిరాయిదారులపై భారం పడకుండా నామమాత్ర రుసుముతో సేవలు అందించాలని భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే నగరపాలక సంస్థ నిర్ణయం తీసుకోనుంది.




