Karimnagar: కరీంనగర్‌లో వృద్ధురాలి హత్య కేసు ఛేదన.. భర్త, మనవడు అరెస్ట్!

Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగారావుపల్లిలో వృద్ధురాలు శంకరమ్మ హత్య కేసును ఛేదించిన పోలీసులు భర్త రామయ్య, మనవడిని బుధవారం అరెస్టు చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 25 Nov 2026 8:51 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో వృద్ధురాలి హత్య కేసు ఛేదన.. భర్త, మనవడు అరెస్ట్!

కరీంనగర్: గంగాధర పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగారావుపల్లి గ్రామంలో వృద్ధురాలు దోమకొండ శంకరమ్మ (70) అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డబ్బులు, బంగారంపై దురాశతో సొంత భార్యనే హత్య చేసిన భర్త దోమకొండ రామయ్య (80), హత్యకు సహకరించిన మృతురాలి మనవడిని గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది .పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించడంతో పాటు, సాంకేతిక మరియు ఇతర ఆధారాలతో కేసును చేదించడం జరిగింది.

సంఘటన వివరాలు..

దోమకొండ రామయ్య, అతని భార్య శంకరమ్మ గత కొన్ని సంవత్సరాలుగా కుటుంబ కలహాల కారణంగా ఒకే ఇంట్లో ఉంటూ వేర్వేరు గదుల్లో నివసించేవారు. శంకరమ్మ కూలి పనులు చేసుకుంటూ సంపాదించిన డబ్బులు ఇవ్వడం లేదనే కారణంతో రామయ్య ఆమెపై కక్ష పెంచుకున్నాడు. అంతేకాకుండా ఆమె వద్ద ఉన్న డబ్బులు, బంగారం పొందాలనే దురాశతో తన భార్య ను చంపితే డబ్బులు బంగారం తనకే వస్తుంది అని తన మనవడికి మద్యం, సిగరెట్లు మరియు ఇతర ఖర్చుల కోసం డబ్బులు ఇస్తానని ఆశ చూపించి హత్యకు సహకరించేలా ప్రేరేపించాడు.

ఈ క్రమంలో తేదీ 08-11-2026 రోజున సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో రామయ్య తన భార్య శంకరమ్మ వెనుక నుంచి నడుము భాగంలో బలంగా కొట్టి కింద పడవేయగా, ఆమె మనవడు చేతులు, కాళ్లు గట్టిగా పట్టుకున్నాడు. అనంతరం రామయ్య చీరతో ఆమె మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

హత్య అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా నిందితులు ఏమీ తెలియనట్లు నటిస్తూ, శంకరమ్మ అనారోగ్యంతో రక్తం కక్కి మరణించిందని అందరినీ నమ్మించారు. మరుసటి రోజు అంత్యక్రియలు నిర్వహించి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.

పోలీసుల దర్యాప్తు..

శంకరమ్మ మరణంపై ఆమె పెద్ద కుమారుడు దోమకొండ అంజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంగాధర ఎస్సై వంశీకృష్ణ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా తేదీ 21-11-2026 రోజున మండల తహసీల్దార్, వైద్యాధికారి సమక్షంలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.

పోలీసులు సేకరించిన సాంకేతిక మరియు ఇతర ఆధారాలు, విచారణ ద్వారా ఈ హత్యకు పాల్పడిన వారిని గుర్తించడం జరిగింది.విచారణలో నిందితులు నేరానికి సంబంధించిన వివరాలను వెల్లడించగా, హత్యకు ఉపయోగించిన చీరను స్వాధీనం చేసుకోవడం జరిగింది.

ఈ కేసు దర్యాప్తులో చొప్పదండి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (ఇన్‌చార్జి)గా విధులు నిర్వహిస్తున్న కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు, గంగాధర ఎస్సై వంశీకృష్ణ ,గంగాధర తహసీల్దార్ రజిత,వైద్యాధికారి విజయ్ వీరి సమన్వయంతో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించడం, సాంకేతిక మరియు ఇతర ఆధారాలను సేకరించడం, నిందితులను గుర్తించడం వంటి దర్యాప్తు ప్రక్రియను చేపట్టి కేసును చేధించడం జరిగింది.

నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకొని, దోమకొండ రామయ్యను సంబంధిత న్యాయస్థానంలో, మైనర్ బాలుడిని జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచేందుకు తదుపరి న్యాయపరమైన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN