Karimnagar: కేటీఆర్, బీఆర్ఎస్‌పై పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు

Karimnagar: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు, బీజేపీతో సంబంధాలపై కేటీఆర్, బీఆర్ఎస్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కృష్ణా జలాలు, కాళేశ్వరంపై విమర్శలు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 29 Nov 2026 10:16 PM IST
Karimnagar
X

Karimnagar: కేటీఆర్, బీఆర్ఎస్‌పై పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు

కరీంనగర్: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తెరవెనుక ఒక్కటేనని మరోసారి స్పష్టమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై విషం కక్కుతున్నారని విమర్శిస్తున్న కేటీఆర్, అదే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న డీలిమిటేషన్ బిల్లుకు ఎందుకు మద్దతు ఇస్తున్నారు? బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం బీఆర్ఎస్ మద్దతు తమకు అవసరం లేదని చెబుతున్నా, కేటీఆర్ ఎందుకు ఉరికి ఉరికి కేంద్రానికి ఊడిగం చేస్తున్నారు? కేసుల భయంతోనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారా? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.

తెలంగాణకు పార్లమెంటులో ప్రాతినిధ్యం పెరుగుతుందనే సాకుతో డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడం సరైంది కాదన్నారు. దేశవ్యాప్తంగా కులగణన, బీసీ రిజర్వేషన్ల కోసం డిమాండ్లు బలంగా వినిపిస్తున్న సమయంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్రం డీలిమిటేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చిందని విమర్శించారు. ప్రస్తుతం పార్లమెంటులో ఉన్న ఎంపీలకు మాట్లాడేందుకు తగినంత సమయం లేని పరిస్థితుల్లో, సభ్యుల సంఖ్య పెరిగితే ప్రజా సమస్యలపై చర్చలకు సమయం ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు.

దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ఇంత కీలకమైన అంశంపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? గతంలో దేశవ్యాప్తంగా 36 పార్టీలను ఏకం చేశానని చెప్పుకున్న కేసీఆర్ ఇప్పుడు ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం ఏమిటి? రాజ్యసభలోని మూడు స్థానాలతో కేంద్రానికి మద్దతు ఇస్తామని కేటీఆర్ ప్రకటించడం వెనుక కేసీఆర్ ఆమోదం ఉందా? అని నిలదీశారు. బీజేపీ అనే ధృతరాష్ట్ర కౌగిలిలో బీఆర్ఎస్ బందీ కావద్దని, ఆ పార్టీ రాజకీయంగా బీజేపీతో కలిసే ప్రయాణం చేస్తే చివరకు తన ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీని అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో కేసీఆర్ స్వయంగా అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ పాత్రను గుర్తించారని, కుటుంబ సమేతంగా ఢిల్లీకి వెళ్లి కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని కేటీఆర్ మర్చిపోయారా? అని ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వం, సోనియాగాంధీ దృఢ సంకల్పం లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమయ్యేదా? అని నిలదీశారు.

తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, సబ్బండ వర్గాలు పోరాటం చేస్తే, పార్లమెంటులో పెప్పర్ స్ప్రే దాడిని సైతం ఎదుర్కొని తెలంగాణ కోసం పోరాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఏమిటో ప్రజలకు తెలుసన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో యువతను రెచ్చగొట్టి శ్రీకాంతాచారి, కిష్టయ్య వంటి బీసీ బిడ్డల ఆత్మబలిదానాలకు కారణమైన నాయకులు ఇప్పుడు దీక్షా దివస్ పేరుతో రాజకీయాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అమరవీరుల త్యాగాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, వారి త్యాగాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని హితవు పలికారు.

లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, నాణ్యతా లోపాలకు నిదర్శనమని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపాలని తీర్మానం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణను ముందుకు తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్న రాజకీయ బంధానికి ఇదే నిదర్శనమని ఆరోపించారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులకు అన్యాయం జరిగిందని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులు, నీటి హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తోందన్నారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులు, నీటి హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తోందని తెలిపారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు అంతర్గత రాజకీయ విభేదాలు, విమర్శలు, ప్రతి విమర్శలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసి పోరాడాలని ప్రభుత్వం తరఫున ప్రతిపక్షాలకు ఆహ్వానం పలికామన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు ఆ పోరాటంలో ఎందుకు భాగస్వాములు కాలేదని ప్రశ్నించారు.

రాజకీయంగా ఎవరికి ఎన్ని విభేదాలు ఉన్నా తెలంగాణ ప్రయోజనాలే అందరికీ ప్రథమ ప్రాధాన్యత కావాలన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగే ప్రతి సందర్భంలో పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఒక్కటై పోరాడాలని పిలుపునిచ్చారు.

కరీంనగర్ జిల్లాకు, మానేరు వాగుకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి, మిడ్ మానేరు ప్రాజెక్టుల పాత్ర కీలకమన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్ జిల్లాకు జరిగిన అన్యాయాన్ని ప్రజలు మర్చిపోలేదని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పినా ఆ పార్టీ నాయకుల వైఖరిలో మార్పు రాలేదన్నారు.

రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడటం అవివేకమని, పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన బీఆర్ఎస్‌కు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సగౌరవంగా ఏర్పాటు చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది అని పేర్కొన్నారు.

ముందు బీఆర్ఎస్‌లోని అంతర్గత విభేదాలు, కుటుంబ కలహాలను చక్కదిద్దుకుని ప్రజా సమస్యలపై మాట్లాడాలని సూచించారు.తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడటం, రాష్ట్ర హక్కులను సాధించడం, ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. రాజకీయాలు ఏవైనా తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం. బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR