Karimnagar: పప్పు దినుసుల రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్!

Karimnagar: చొప్పదండి సహకార సంఘం ద్వారా పప్పు దినుసులకు క్వింటాలుకు రూ.500 బోనస్‌పై కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రశంస; ప్రత్యామ్నాయ పంటలు, జలసిరి పనులపై సమీక్ష.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 22 Nov 2026 9:53 PM IST
Karimnagar
X

Karimnagar: పప్పు దినుసుల రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్!

కరీంనగర్: పప్పు దినుసుల సాగు చేసే రైతులకు కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్ అందించేలా చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చేపట్టిన వినూత్న కార్యక్రమం అభినందనీయమని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రశంసించారు. రైతులకు అదనపు ఆదాయం కల్పించే ఈ విధానం జిల్లాలోని ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలపై జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ, సహకార శాఖల అధికారులను ఆదేశించారు.

ఎల్‌నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు, ఆయిల్‌పామ్, కూరగాయల సాగు విస్తరణ, వి.బి.జి. రామ్‌జీ పథకం కింద జలసిరి పనుల పురోగతి, పశుగ్రాసం పెంపకం తదితర అంశాలపై కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, డీఆర్డీఏ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

ఎల్‌నినో ప్రభావంతో రానున్న కాలంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. పప్పు దినుసుల సాగు విస్తరణకు బోనస్ వంటి ప్రోత్సాహక కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.

బోనస్ విధానంపై విస్తృత ప్రచారం..

చొప్పదండి సహకార సంఘం చేపట్టిన కార్యక్రమం ఉద్దేశం, రైతులకు అందే అదనపు ఆదాయం, పంట సాగు నుంచి కొనుగోలు వరకు కల్పించే అవకాశాలపై గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఇతర ప్రాంతాల రైతులు, సహకార సంఘాలు కూడా ఈ విధానాన్ని పరిశీలించి పప్పు దినుసుల సాగుకు ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని సూచించారు. రైతులకు విత్తనాల సరఫరా నుంచి పంట కొనుగోలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వరకు సమగ్ర సహకారం అందించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.

ఎల్‌నినో ముప్పు.. ప్రత్యామ్నాయ పంటలే మేలు..

వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నీటి లభ్యతకు అనుగుణంగా తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను రైతులు ఎంచుకునేలా అవగాహన కల్పించాలన్నారు. మండలాల వారీగా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించి పంటల మార్పిడిపై సూచనలు అందించాలని ఆదేశించారు. శాస్త్రవేత్తల సలహాలు రైతులకు చేరేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు.

ఆయిల్‌పామ్, కూరగాయల సాగుకు ప్రోత్సాహం..

జిల్లాలో ఆయిల్‌పామ్ సాగును విస్తరించాలని ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వ్యవసాయ హర్టికల్చర్ అధికారులు సంయుక్తంగా సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలో పెద్ద మొత్తంలో ఆయిల్ ఫామ్ సాగుచేశాల రైతులను చైతన్య పరచాలన్నారు. కూరగాయల సాగును ప్రోత్సహించడంతోపాటు పందిళ్ల ఏర్పాటు, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ల వినియోగానికి రైతులకు అవసరమైన సహకారం అందించాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలు సమన్వయంతో లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్నారు.

200 ఎకరాల్లో పశుగ్రాసం పెంపకం...

పశువులకు పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వి.బి.జి. రామ్‌జీ పథకం కింద 200 ఎకరాల్లో పశుగ్రాసం పెంపకానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి అవసరమైన పనుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

గ్రామాల్లో జలసిరి ఉట్టిపడాలి..

భూగర్భ జలాలను పెంపొందించేందుకు గ్రామాల్లో పెద్ద ఎత్తున నీటి సంరక్షణ పనులు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇంటింటికీ ఇంకుడు గుంతలు, రైతుల పొలాల్లో నీటి కుంటల నిర్మాణాన్ని ప్రోత్సహించాలన్నారు. తాగునీటి సరఫరా బోర్లకు రీఛార్జ్ వ్యవస్థలు ఏర్పాటు చేయడంతోపాటు వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల పెరుగుదలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో జలసిరి కనిపించేలా సమగ్ర కార్యాచరణ చేపట్టాలన్నారు. పెద్ద ఎత్తున గ్రామాల్లో ఈ పనులు చేపట్టేందుకు ప్రణాళిక బంధంగా అధికారులు ముందుకు వెళ్లాలన్నారు.

రైతులకు ఆర్థిక చేయూత అందించాలి..

నాబార్డు, డీసీసీబీ ద్వారా అమలవుతున్న పథకాలపై రైతులకు అవగాహన కల్పించి అవసరమైన ఆర్థిక సహాయం అందేలా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఆధునిక సాగు విధానాలు, నీటి పొదుపు పద్ధతులపై రైతులకు నిరంతరం మార్గనిర్దేశం చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, డీఆర్డీఓ గీత, జిల్లా పశువైద్యాధికారి లింగారెడ్డితోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR