Karimnagar: ప్రాథమిక హక్కులను కాల రాస్తున్న మోడీ సర్కార్..

Karimnagar: కరీంనగర్ సీపీఎం జిల్లా కార్యాలయంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా "భారత రాజ్యాంగం- ఎదుర్కొంటున్న సవాళ్లు" అనే అంశంపై సెమినార్ నిర్వహించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 17 May 2026 4:26 PM IST
Karimnagar
X

Karimnagar: ప్రాథమిక హక్కులను కాల రాస్తున్న మోడీ సర్కార్..

కరీంనగర్: సిపిఎం జిల్లా కార్యాలయం ముకుంద లాల్ మిశ్రా భవన్లో కామ్రేడ్ గుడికందుల సత్యం అధ్యక్షతన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా "భారత రాజ్యాంగం- ఎదుర్కొంటున్న సవాళ్లు" అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ ఈ దేశాన్ని నియంతృత్వం వైపు మోడీ సర్కార్ తీసుకెళ్తుందని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని అన్నారు. దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగబద్ధ సంస్థలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తూ, తమ జేబు సంస్థలుగా తయారు చేస్తున్నారన్నారు.

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించే గొంతులను నొక్కుతూ రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తూ,సంపన్న వర్గాల కొమ్ముకాస్తూ, దేశ సంపదను అదానీ, అంబానీ లాంటి బడా కార్పొరేట్ పెట్టబడిదారులకు దోచిపెడుతున్నారన్నారు. ఎలాంటి సంప్రదింపు లేకుండా ప్రత్యేక సమగ్ర సవరణ తెచ్చారని, ఇది ఏకపక్ష నిర్ణయం అన్నారు. పౌరసత్వానికి సంబంధించిన దరఖాస్తులు, డాక్యుమెంటరీ ఆధారాలు అవసరం అవుతాయని పేదవారు ఎక్కడినుండి తీసుకొస్తారు అని ప్రశ్నించారు.

బీహార్ రాష్ట్రంలో 65 లక్షల ఓట్లు, బెంగాల్ రాష్ట్రంలో 70 లక్షల ఓట్లు తొలగించారన్నారు. ఎలక్షన్ కమిషన్ బిజెపి పార్టీకి ఏజెంట్ గా పని చేస్తుందన్నారు. రాజ్యాంగ పరిధిని దాటి జోక్యం చేసుకుంటుంది అన్నారు. ఈడి, సిబిఐ, ఐటి, ఎలక్షన్ కమిషన్ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తుందన్నారు. ప్రశ్నించే మేధావులపై, ప్రతిపక్ష పార్టీల నాయకులపై అడ్డగోలుగా కేసులు నమోదు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వపు హక్కు, ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ, ఆర్టికల్ 21 జీవించే హక్కులను బిజెపి ప్రభుత్వం కాలరాస్తుందన్నారు.

సామాన్యులకు రాజ్యాంగ పలాలు దక్కడం లేదని, అన్నారు. ఒక శాతం మంది చేతిలోనే 50 శాతం సంపద పోగుపడిందన్నారు. దేశంలో దారిద్ర రేఖకు దిగువ 45 కోట్ల మంది ఉన్నారని అన్నారు. బిజెపి పాలనలో ఆర్థిక,రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అసమానతలు పెరిగిపోయాయి అన్నారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వాళ్లే ఇప్పుడు రాజ్యమేలుతున్నారని విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా ప్రజల మధ్య విభజన తీసుకువచ్చి తమ స్వార్ధ రాజకీయాలకు వాడుకుంటున్నారన్నారు.

బిజెపి హాయంలో దళితులపై దాడులు పెరిగిపోయాయి అన్నారు, క్రిస్టియన్ల పై మైనార్టీలపై పెద్ద ఎత్తున దాడి జరుగుతుందన్నారు. రైతు, కార్మిక, వ్యవసాయ కూలీలు, మరియు పేద మధ్య ప్రజలపై పన్నుల భారం మోపుతుందన్నారు. దేశంలో రోజురోజుకు ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయన్నారు. ఒకపక్క దేశంలో నిరుద్యోగం పెరిగిపోయి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తగ్గాయని దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చాక కొత్తగా పరిశ్రమలు సృష్టించకపోగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం చేస్తూ కారు చౌకగా పెట్టుబడిదారులకు, బడా పారిశ్రామిక వేత్తలకు దోచిపెడుతుందన్నారు. మతం వ్యక్తిగత విశ్వాసం అయినప్పటికీ దానిని రాజకీయాలకు పులిమి బీజేపీ లబ్ధి పొందుతుందని, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతాంగ పోరాటంతో దిగివచ్చిన మోడీ ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు దొడ్డిదారిన అవే చట్టాలను అమలు చేసేందుకు పూనుకుంటుందని అన్నారు.

స్వాతంత్రానికి పూర్వం సాధించుకున్న కొన్ని కార్మిక చట్టాలు స్వాతంత్రం వచ్చాక కార్మికుల పోరాటాలతో సాధించుకున్న చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా తెచ్చిందని, పని గంటలు పెంచుతూ, ఉద్యోగ భద్రత లేకుండా చేస్తూ, కార్మికులను మరింత బానిసత్వంలోకి నెట్టే విధంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా, వారి లాభార్జన ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పెట్టుబడి దారీ ప్రయోజనాలు ముందుకు సాగాలంటే హక్కులు చట్టాలు, పోరాటాలు సమ్మెలు ఆటంకంగా ఉండకూడదని మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోళ్లు ఇతర చట్టాలు, సవరణలు తీసుకువచ్చిందన్నారు.

మోడీ ప్రభుత్వం ఎమర్జెన్సీ కాలాన్ని మరిపిస్తుందన్నారు. ఈనాటి అప్రకటిత ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా బిజెపి నియంతృత నయా ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. దేశ సమైక్యత కోసం లౌకిక శక్తులు ఐక్యం కావాలని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూనే, రాజ్యాంగబద్ధ సంస్థల స్వతంత్రను కాపాడాలన్నారు. ఈ సెమినార్ లో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకట్ రెడ్డి, గిట్ల ముకుంద రెడ్డి, గుడికందుల సత్యం, జి బీమా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్, సుంకర సంపత్,ఎడ్ల రమేష్, జి రాజేశం, జిల్లా నాయకులు గజ్జల శ్రీకాంత్, రాయికంటి శ్రీనివాస్, కంపెల్లి అరవింద్, నరేష్, పుల్లెల మల్లయ్య, పున్నం రవి, వినయ్, భోగేష్, సందేశ్, రాకేష్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story