Karimnagar: తల్లిదండ్రుల భరణం సకాలంలో అందేలా చూడాలి

Karimnagar: కరీంనగర్ ఆర్డీవో షర్మిల ఆధ్వర్యంలో వయోవృద్ధుల సంరక్షణ చట్టంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తల్లిదండ్రులకు సకాలంలో భరణం అందాలని ఆదేశించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 30 Oct 2026 10:18 PM IST
Karimnagar
X

Karimnagar: తల్లిదండ్రుల భరణం సకాలంలో అందేలా చూడాలి

కరీంనగర్: వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ కోసం ఆర్డీవోలు జారీ చేసిన ఆదేశాల ప్రకారం వారికి అందాల్సిన నెలవారీ భరణం కచ్చితంగా, సకాలంలో అందేలా అధికారులు పర్యవేక్షించాలని కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి షర్మిల అన్నారు.

తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని ఉద్దేశంలో భాగంగా ఎంపీడీవోలు, తహసిల్దార్లు, సిడిపివోలు, పోలీస్ అధికారులతో ఏర్పాటుచేసిన కరీంనగర్ డివిజన్ కమిటీ సమన్వయ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగింది.

ఈ సమావేశంలో ఆర్డీవో షర్మిల మాట్లాడుతూ తల్లిదండ్రులకు కోర్టు లేదా ఆర్డిఓ నుండి ప్రతినెలా నిర్దేశించిన మొత్తాన్ని వారసులు ఆలస్యం లేకుండా చెల్లించేలా అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. గ్రామాలు, మండలాల వారీగా భరణం ఉత్తర్వులు అందుకున్న వారి వివరాలు సేకరించి ప్రతినెల భరణం అందుతున్నదీ లేనిదీ పర్యవేక్షించాలని తెలిపారు. ఒకవేళ భరణం అందకపోతే పిల్లలు, వారసులతో నిర్దేశించిన మొత్తాన్ని ఇప్పించాలని అన్నారు. తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ చట్టం పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు.

జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి మాట్లాడుతూ

భరణం కోసం తల్లిదండ్రులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి వద్దకే అధికారులు వెళ్లి సమస్య పరిష్కరించాలని తెలిపారు. భరణం ఇవ్వని వారిపై అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.

ప్రతినెలా మండలాల వారీగా సమావేశం నిర్వహించుకొని భరణం చెల్లింపునకు సంబంధించిన నివేదికను సమర్పించాలని అన్నారు. వయోవృద్ధుల భరణం సమస్యల పరిష్కారానికి మేమున్నామని నమ్మకం కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సిడిపివోలు, సూపర్వైజర్లు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR