Karimnagar: గ్రామకంఠం భూములను రిజిస్ట్రేషన్ చేయొద్దు: సర్పంచ్ తిరుపతి!

Karimnagar: తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెంలో గ్రామకంఠం భూములను ప్రైవేటు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేయవద్దని సర్పంచ్ తాట్ల తిరుపతి సబ్ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశారు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 9 Nov 2026 5:35 PM IST
Karimnagar
X

Karimnagar: గ్రామకంఠం భూములను రిజిస్ట్రేషన్ చేయొద్దు: సర్పంచ్ తిరుపతి!

కరీంనగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలి పాలెం గ్రామంలోని గ్రామకంఠం భూములను కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకొని పట్టా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారనీ, వాటిని పట్టాలు చేయకుండా ఆపాలని కోరుతూ ఆ గ్రామ సర్పంచ్ తాట్ల తిరుపతి ఆధ్వర్యంలో తిమ్మాపూర్ సబ్ రిజిస్ట్రార్ కు వినతిపత్రం అందజేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామంలోని ఇంటి నెంబర్లు 4-99/1, 4-99/2 గల యజమానులు కొమ్మెర సుమలత భర్త శ్రీనివాస్, కొమ్మెర సునీత భర్త గోపాల్ రెడ్డికి చెందిన ఇండ్లు పట్టా భూమిలో ఉన్నాయన్నారు. అయితే వాటికి అనుకొని గ్రామకంఠం భూములు ఉన్నందున, పైన తెలిపిన రెండు ఇంటి నెంబర్లు గల యజమానుల భర్తలు ఆ గ్రామకంఠం భూములను ఆక్రమించుకొని, ఇంటి నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయించేందుకు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి పీఏ ప్రయత్నం చేస్తున్నారనీ, అసలు అతడికి.. మొగిలిపాలెం గ్రామానికి సంబంధం ఏమిటని సర్పంచ్ తిరుపతి ప్రశ్నించారు.

తమ గ్రామంలోని భూముల విషయంలో ఎమ్మెల్యేగానీ, అతని పీఏగాని జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాగా.. గ్రామకంఠం భూములను కలుపుకొని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్ చేయవద్దని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు అవుదుర్తి రాంకిషన్, గాండ్ల శ్రీనివాస్, దుర్గం శ్రీనివాస్, ఉప సర్పంచుల ఫోరం జిల్లా అధికార ప్రతినిధి మేకల మహేష్, ఉప సర్పంచ్ అల్వాల ప్రణిత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU