Siricilla: జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై సీఎంకు కేటీఆర్ విజ్ఞప్తి!
Siricilla: సిరిసిల్ల జేఎన్టీయూ క్యాంపస్ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని, కొత్త భవనం పూర్తయ్యే వరకు ఇక్కడే తరగతులు నడపాలని సీఎం రేవంత్‌ను కేటీఆర్ కోరారు.
Siricilla: జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై సీఎంకు కేటీఆర్ విజ్ఞప్తి!
Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. శాశ్వత క్యాంపస్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి, విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
2021లో రూ.402 కోట్ల పరిపాలనా అనుమతులతో మంజూరైన జేఎన్టీయూ శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని కేటీఆర్ పేర్కొన్నారు. మంధేపల్లి గ్రామంలో 20 ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ, నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో కళాశాల ప్రస్తుతం అగ్రహారంలోని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో తాత్కాలికంగా కొనసాగుతోందని తెలిపారు.
ప్రస్తుత ప్రాంగణం నుంచి కళాశాలను మరో ప్రైవేటు భవనానికి తరలించే ప్రతిపాదనలు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న తరగతి గదులు, ప్రయోగశాలలు, ఇతర మౌలిక సదుపాయాలు నిరుపయోగం కాకుండా చూడాలని సూచించారు.
మంధేపల్లిలో కేటాయించిన స్థలంలో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసి, పనులను వేగవంతం చేయాలని కేటీఆర్ కోరారు. కొత్త క్యాంపస్ పూర్తయ్యే వరకు కళాశాలను ప్రస్తుత ప్రాంగణంలోనే కొనసాగించేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు ప్రస్తుత ప్రాంగణాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేయకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించడంలో ఈ కళాశాల కీలకమని కేటీఆర్ పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.




