Sircilla: సిరిసిల్లలో ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!

Sircilla: ఈ నెల 30న రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 26 Sept 2026 5:39 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!

Sircilla: ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితె, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంత్రులకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు సిరిసిల్ల రగుడు బైపాస్ రోడ్ వద్ద ఉన్న మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రులు సూచించారు.

సీఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, భద్రతా చర్యలను ముందస్తు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణం, పార్కింగ్, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధిలో అధికారులు భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజలు చిరకాలం గుర్తుపెట్టుకునేలా సేవలు అందించాలని, జిల్లా సమగ్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అన్నారు. ప్రణాళిక ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA