Sircilla: బాల్య వివాహ రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్లను తీర్చిదిద్దాలి!

Sircilla: రాజన్న సిరిసిల్లను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని మర్రిపల్లి చందన, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ గితే గురువారం పిలుపునిచ్చారు.

KALEEM, SIRICILLA
Published on: 26 Nov 2026 11:12 PM IST
Sircilla
X

Sircilla: బాల్య వివాహ రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్లను తీర్చిదిద్దాలి!

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. పిల్లలను చదివించి, వారు ఉన్నత స్థానాలకు ఎదిగేలా ప్రోత్సహించాలని సూచించారు.

జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పూజారులు, పాస్టర్లు, ఖాజీలు, మత పెద్దలకు బాల్య వివాహాల నివారణపై 'బాల్య వివాహం.. బతుకు ఆగం' పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితే హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల నివారణకు అందరూ కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. బాల్య వివాహాల వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక సమస్యలను వివరించారు.

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన మాట్లాడుతూ.. బాలల హక్కుల పరిరక్షణ కోసం కమిషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. బాల్య వివాహ రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్లను తీర్చిదిద్దే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి కుటుంబంలో మత పెద్దల ప్రభావం, పాత్ర ఎక్కువగా ఉంటుందని, అందువల్ల బాల్య వివాహాల నిర్మూలన, లైంగిక వేధింపుల నివారణ, బాలల హక్కుల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలందరినీ చదివించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలని, వివాహాలు నిర్వహించే సమయంలో వధూవరుల వయస్సును తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని స్పష్టం చేశారు.

కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. బాల్య వివాహాల నివారణ కోసం ప్రభుత్వం 2006లో చట్టం తీసుకొచ్చిందని, బాల్య వివాహాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. సమాజంలో మార్పు తీసుకురావడంలో అన్ని మతాల పెద్దలు కీలక పాత్ర పోషించాలని కోరారు. 18 ఏళ్లలోపు బాలికలకు, 21 ఏళ్లలోపు బాలురకు వివాహాలు చేయకూడదని స్పష్టం చేశారు. బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

గత ఏడాది కాలంలో అధికారులు జిల్లాలో 12 బాల్య వివాహాలను అడ్డుకున్నారని కలెక్టర్ వెల్లడించారు. ప్రతి విద్యార్థి బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. బాలల దత్తత ప్రక్రియను కూడా చట్ట నిబంధనల ప్రకారమే చేపట్టాలని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా సి-సెక్షన్ ఆపరేషన్లలో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని పేర్కొంటూ, ప్రసవాల విషయంలో వైద్యుల సూచనలు పాటించాలని తెలిపారు.

ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ.. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే 1098 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. బాల్య వివాహాల సమాచారం అందిన వెంటనే అధికారులు స్పందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని మతాలకు సంబంధించిన కార్యక్రమాల్లో బాల్య వివాహాల నివారణ, పిల్లల విద్య, బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించాలని కోరారు. బాల్య వివాహాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA